పాఠశాలను మార్చకండి
తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను మార్చకండి అంటూ పుంగనూరు మండలం, మరసనపల్లెకు చెందిన గ్రామస్తులు రమణప్ప తదితరులు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో అర్జీ అందజేశారు. మరసనపల్లె గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోందని, ఆ పాఠశాలలో ప్రస్తుతం 22 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. త్వరలో ఆ పాఠశాలలో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను దూరప్రాంతంలో ఉన్న ఈడిగపల్లెకు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అలా మారిస్తే తమ పిల్లలు కిలోమీటరు వరకు కాలినడకన నడిచి పాఠశాలకు వెళ్లాల్సి వస్తుందని పేర్కొన్నారు. తమ గ్రామంలోనే పాఠశాలను కొనసాగించాలని కలెక్టర్‌ను కోరారు.


