కారు ఢీకొని కల్లుపల్లి వాసి మృతి
పలమనేరు: పట్టణ సమీపంలోని గంటావూరు ఫ్లైఓవర్ వద్ద బుధవారం స్కూటీలో రోడ్డు దాటు తున్న వ్యక్తిని కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. గంగవరం మండలం కల్లుపల్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మునిరత్నం అలియాస్ చిన్నబ్బోడు పలమనేరులోని గంటావూరు చెరువుకట్ట రోడ్డు నుంచి స్కూటీలో వెళుతూ హైవే దాటే సమయంలో ఓ కారు వేగంగా వచ్చి అతడి స్కూటీని ఢీకొంది. దీంతో మునిరత్నం అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది. కాగా మృతునికి డిగ్రీ చదివే కుమారుడున్నారు. ఇతని భార్య కొన్నాళ్ల కిందట మృతి చెందింది. గత నెలలో మృతుడి అన్న సుబ్రమణ్యం అలియాస్ పెద్దబ్బోడు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కల్లుపల్లెలో విషాదచాయలు అలుముకున్నాయి.
రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
వడమాలపేట (విజయపురం) : తిరుపతిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న డిల్లీ (40) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా.. నాగలాపురం వినోబానగర్‌కు చెందిన డిల్లీ తిరుపతిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా.. వడమాలపేట కదిరిమంగళం మలుపు వద్ద వెంకటగిరికి చెందిన ఓ కుటుంబం అంజేరమ్మను దర్శించుకుని కారులో తిరిగి వెళ్తూ ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన డిల్లీని పోలీసులు తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ధర్మారెడ్డి తెలిపారు.
తల్లిపై కొడుకులు, కోడళ్ల దాడి
చిత్తూరు అర్బన్: కన్నతల్లిపై దాడికి పాల్పడిన కొడుకులు, ఇద్దరు కోడళ్లపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. చిత్తూరు వన్‌టౌన్ సీఐ మహేశ్వర కథనం మేరకు.. నగరంలోని వెంగళరావు కాలనీకి చెందిన సుగుణమ్మ ఈనెల 5వ తేదీ ఇంటి వద్ద ఉండగా, కుటుంబ విషమయై తన కొడుకులతో వాగ్వాదం జరిగింది. దీంతో ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్లు కలిసి తనపై దాడి చేసి, గాయపరచారని సుగుణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై బాధితురాలి కొడుకులు కరుణకుమార్, హరీష్, కోడళ్లు రేవతి, రోసీపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
యువతి ఆత్మహత్య
బంగారుపాళెం: మండలంలోని తుంబపాళేనికి చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడి, చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. సీఐ కథనం మేరకు.. గ్రామానికి చెందిన భాస్కరయ్య కుమారై శశికళ(21) డిగ్రీ వరకు చదువుకుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించలేక పోవడంతో మనస్తాపానికి గురై ఈ నెల 5వ తేదీ పిడుదుల నివారణ మందు తాగింది. ఈ విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పీఐ తెలిపారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కారు ఢీకొని కల్లుపల్లి వాసి మృతి


