యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి
కార్వేటినగరం: అయిల్ పామ్ సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి సాధ్యమవుతుందని జిల్లా ఉద్యానశాఖ అధికారి మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యానశాఖ అధికారి మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంట నాలుగో సంవత్సరం నుంచి దిగుబడి వస్తోందని, అప్పటి వరకు అంతర పంటలు సాగు చేసుకుని, రెండు విధాల లాభాలు గడించవచ్చన్నారు. ఈ పంట 30 ఏళ్ల వరకు రైతుకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఆయిల్ పామ్ పంటను నీరు ఇంకే అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చని, పంట సాగుకు రైతులకు 40 శాతం సబ్సిడీ వస్తోందన్నారు. మొక్కలను త్రిభుజా కార పద్ధతిలో నాటు కోవాలని, అలాగే 14 నుంచి 18 నెలల్లో పూతకు వస్తుందని, రెండున్నరేళ్ల వరకు పూతను తీసి వేయాలన్నారు. ఆయిల్ పామ్ పంటలో కోకో పంటను కూడా అంతర పంటగా సాగు చేసుకోవచ్చని తెలిపారు. నిండ్ర, కార్వేటినగరం, గంగాధరనెల్లూరు మండలాల్లో ప్రభుత్వం ఆయిల్‌పామ్ మొక్కలను ఉచితంగా అందింస్తొందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఏపీఎంఐపీ పీడీ బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంటలో చీడపీడల బెడద తక్కువగా ఉంటుందని, కోకో ద్వారా చాక్లెట్ తయారీతో పాటు వాటి బొప్పెల్లో పొటాషియం అధికంగా ఉండటంతో వాటిని పశువుల దాణా తయారీలో వినియోగిస్తారని పేర్కొన్నారు. చిన్న సన్నకారు రైతులకు 90 శాతం, పెద్ద రైతులకు 70 శాతం రాయితీ ద్వారా డ్రిప్ పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరాజు, మండల వ్యవసాయ అధికారి హేమలత, 3 ఎఫ్ ఆయిల్‌ఫామ్ సిబ్బంది, రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.


