వి.కోట: తమిళనాడు నుంచి ఉప్పుడు బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్టు సీఐ లింగప్ప తెలిపారు. వారి నుంచి 62 బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ముందుగా అందిన సమాచారంతో శుక్రవారం రాత్రి కస్తూరి నగరం వద్ద వాహనాల తనిఖీ చేపట్టినట్టు తెలిపారు. ఈ క్రమంలో బొలేరో వాహనంలో ఉప్పుడు బియ్యం తరలిస్తున్న బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లికి చెందిన హరి, గుండపల్లికి చెందిన వెంకటరమణ, పలమనేరు టౌన్‌కు చెందిన అహమ్మద్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. వారు ఉప్పుడు బియ్యాన్ని కర్ణాటకకు తరలిస్తున్నారని తెలిపారు. వారి నుంచి 62 బస్తాల్లో ఉన్న 3,100 కేజీల ఉప్పుడు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా అక్రమంగా వస్తువులను తరలిస్తుంటే సమాచారం ఇవ్వాలని కోరారు.