
మాట్లాడుతున్న ఎంపీ రెడ్డెప్ప, పక్కన కలెక్టర్, ఎస్పీ
చిత్తూరు కలెక్టరేట్ : ఎస్సీ,ఎస్టీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఎంపీ రెడ్డెప్ప అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. పరిష్కారంలో సమస్యలేమన్నా ఉన్నట్లైతే తన దృష్టికి తీసుకు రావాలని తెలిపారు. కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ కమిటీలో సభ్యులు వెల్లడించిన సమస్యలతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఎస్పీ రిశాంత్‌రెడ్డి మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల ను నిష్పక్షపాతంగా పరిష్కరిస్తున్నామన్నారు. చట్టానికి లోబడి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ జిల్లాలోని దళితవాడల్లో శ్మశాన వాటికల దారి సమస్యలు పరిష్కరించాలన్నారు. చిత్తూరు రూరల్ మండలం బంగారెడ్డిపల్లెకు దారి ఏర్పాటు చేయాలని కోరారు. డీఆర్‌వో రాజశేఖర్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రాజ్యలక్ష్మి, ఆర్డీవోలు రేణుక, సుజన, శివయ్య, పలు సంఘాల నాయకులు దేవరాజులు, డేవిడ్, రాజ్‌కుమార్, మునస్వామి, తదితరులు పాల్గొన్నారు.