Xiaomi India Latest News, Xiaomi Increases 20% Production Capacity In India - Sakshi
Sakshi News home page

మరింత ‘స్మార్ట్‌’గా ఎంఐ తయారీ

Published Fri, Feb 26 2021 12:17 AM

Xiaomi To Set Up 3 Plants To Boost Local Production - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా తయారీ(మేకిన్‌ ఇండియా)కి ప్రాధాన్యతనిస్తూ చైనీస్‌ దిగ్గజం ఎంఐ తాజాగా కాంట్రాక్ట్‌ తయారీ కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది. స్మార్ట్‌ ఫోన్లు, స్మార్ట్‌ టీవీల తయారీకి బీవైడీ, డీబీజీ, రేడియంట్‌లతో చేతులు కలిపింది. దీనిలో భాగంగా ఎంఐ తరఫున బీవైడీ, డీబీజీ స్మార్ట్‌ ఫోన్లను తయారు చేయనుండగా.. స్మార్ట్‌ టీవీలను రేడియంట్‌ రూపొందించనుంది. తద్వారా దేశీయంగా స్మార్ట్‌ టీవీల తయారీని భారీగా పెంచుకోనుంది. హర్యానా యూనిట్‌లో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన డీబీజీ.. ఇకపై తమ బ్రాండ్‌ తయారీ సామర్థ్యాన్ని 20% పెంచనున్నట్లు షావోమీ ఇండియా ఎండీ మను జైన్‌ పేర్కొన్నారు. తమిళనాడులో ఏర్పాటైన బీవైడీ యూనిట్‌ కార్యకలాపాలు త్వరలో ప్రారంభంకానున్నట్లు మను జైన్‌ తెలియజేశారు.

5 క్యాంపస్‌లు 
దేశవ్యాప్తంగా ప్రస్తుతం షావోమీ ఐదు క్యాంపస్‌లను కలిగి ఉంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో ఫోన్లను అసెంబుల్‌ ఫాక్స్‌కాన్, ఫ్లెక్స్‌లతో జట్టు కట్టింది. స్మార్ట్‌ఫోన్లకు పెరుగుతున్న భారీ డిమాండ్‌ నేపథ్యంలో తయారీ సామర్థ్యాన్ని విస్తరించవలసి ఉన్నట్లు జైన్‌ వెల్లడించారు. ఇంటివద్ద నుంచే ఆఫీస్‌ వర్క్, చదువులు కొనసాగుతున్న కారణంగా అత్యధిక కంటెంట్‌ వినియోగమవుతున్నట్లు చెప్పారు. దీంతో డిమాండుకు అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచుకోనున్నట్లు తెలియజేశారు. స్మార్ట్‌ ఫోన్లలో వినియోగిస్తున్న విడిభాగాలు స్థానికంగా తయారు చేసినవి లేదా అసెంబుల్డ్‌ అయినవేనని పేర్కొన్నారు.

ఫోన్ల విలువలో 75 శాతంవరకూ స్థానికంగా సమకూర్చుకున్న విభాగాలతోనే రూపొందుతున్నట్లు వివరించారు. పీసీబీఏ, సబ్‌–బోర్డులు, కెమెరా మాడ్యూల్స్, బ్యాక్‌ ప్యానల్స్, వైర్లు, చార్జర్లు దేశీయంగా తయారవుతున్నట్లు వెల్లడించారు. వీటిని సన్నీ ఇండియా, ఎన్‌వీటీ, శాల్‌కాంప్, ఎల్‌వై టెక్, సన్‌వోడా తదితరాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అన్ని కార్యకలాపాల ఫలితంగా 30,000 మందికి ఉపాధి కల్పించినట్లు జైన్‌ తెలియజేశారు. స్మార్ట్‌ టీవీ విభాగంలోనూ 1,000 మంది పనిచేస్తున్నట్లు తెలియజేశారు.

2020లో జూమ్‌: కోవిడ్‌–19 నేపథ్యంలో 2020లో 15 కోట్ల యూనిట్ల స్మార్ట్‌ఫోన్‌ షిప్‌మెంట్స్‌ నమోదయ్యాయి. కౌంటర్‌పాయింట్‌ గణాంకాల ప్రకారం అక్టోబర్‌–డిసెంబర్‌ కాలంలో వార్షికంగా 19 శాతం వృద్ధిని సాధించగా.. పోకో బ్రాండుతో కలిపి షావోమీ 26 శాతం మార్కెట్‌ వాటాను సొంతం చేసుకుంది. తద్వారా టాప్‌ ర్యాంకులో నిలవగా.. 21 శాతం వాటాతో శామ్‌సంగ్, 16 శాతంతో వివో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక రియల్‌మీ వాటా 13 శాతంకాగా.. ఒప్పో 10 శాతం మార్కెట్‌ వాటాను కైవసం చేసుకుంది. 2021లో స్మార్ట్‌ ఫోన్‌ షిప్‌మెంట్స్‌ 16–16.5 కోట్ల యూనిట్లకు చేరవచ్చని జైన్‌ అంచనా వేస్తున్నారు. ఈ బాటలో ఓటీటీ కంటెంట్‌కు పెరుగుతున్న ఆదరణ కారణంగా స్థానికంగా తయారైన 30 లక్షల స్మార్ట్‌ టీవీలను విక్రయించినట్లు వెల్లడించారు. 

Advertisement
Advertisement