పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలపై మహిళల ఆసక్తి

Women in Tier 2 cities and above dominate the job market - Sakshi

నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫాం ‘అప్నా’ నివేదిక

న్యూఢిల్లీ: అవసరాల రీత్యానే కాకుండా ఆర్థిక స్వాతంత్య్రం కోసం కూడా ఉద్యోగాలు చేయాలనుకునే మహిళల సంఖ్య పెరుగుతోంది. తీవ్ర పోటీతో కూడుకున్న జాబ్‌ మార్కెట్లో తమకంటూ గుర్తింపు సాధించుకోవాలని వారు కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా శ్రమతో కూడుకున్నవి, నైట్‌ షిఫ్టులు, పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలు చేసేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు. 2022లో ట్రెండ్స్‌కి సంబంధించి ఉద్యోగాలు, ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫాం ’అప్నా’ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలకు మహిళల నుంచి వచ్చిన దరఖాస్తులు 67 శాతం పెరిగాయి.

అదే సమయంలో ఫుల్‌ టైమ్‌ ఉద్యోగాలకు వచ్చిన అప్లికేషన్లు 34 శాతమే పెరిగాయి. అటు నైట్‌ షిఫ్ట్‌ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న మహిళల సంఖ్య 60 శాతం పెరిగింది. శ్రమ ఎక్కువగా ఉండే డెలివరీ, ల్యాబ్‌ టెక్నీషియన్స్, ఫ్యాక్టరీ వర్కర్లు, డ్రైవర్ల ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు 34 శాతం పెరిగినట్లు అప్నాడాట్‌కో చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ మానస్‌ సింగ్‌ తెలిపారు. పేటీఎం, జొమాటో, ర్యాపిడో, స్విగ్గీ వంటి కంపెనీలు తమ కార్యాలయాల్లో సిబ్బందిపరమైన వైవిధ్యాన్ని పాటించేందుకు మహిళల కోసం అత్యధికంగా ఉద్యోగాలను పోస్ట్‌ చేశాయి. హైదరాబాద్, చెన్నైలాంటి పెద్ద నగరాలతో పాటు ఇండోర్‌లాంటి చిన్న పట్టణాల్లోనూ పోస్టింగ్‌లు 28 శాతం పెరిగినట్లు అప్నా నివేదిక పేర్కొంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top