నైట్‌షిఫ్టుల్లో పనిచేసేవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..! | Health Tips: Tips For Healthy Eating While Working The Night Shift | Sakshi
Sakshi News home page

నైట్‌షిఫ్టుల్లో పనిచేసేవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..!

Apr 8 2025 9:27 AM | Updated on Apr 8 2025 11:34 AM

Health Tips: Tips For Healthy Eating While Working The Night Shift

ఇటీవల చాలామంది నైట్‌ డ్యూటీలు చేస్తున్నారు. గతంలో కేవలం కొద్దిమంది స్థానంలో ఇటీవల అమెరికా టైమ్‌కు తగ్గట్లుగా పనిచేయాల్సి రావడంతో రాత్రిళ్లు పనిచేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సాధారణంగా ప్రతిరోజూ పగలు పనిచేసి, రాత్రి నిద్రపోయే వారి ఆహారపు అలవాట్లతో పోలిస్తే... నైట్‌ షిఫ్ట్‌లలో పనిచేసేవారు తమ ఆహారపు అలవాట్లలో కొద్దిపాటి మార్పులు చేసుకోవాల్సి వస్తోంది. లేక΄ోతే వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలెక్కువ. నైట్‌ షిఫ్టుల్లో పనిచేసేవారు తమ ఆహారపు అలవాట్లలో చేసుకోవాల్సిన మార్పులేమిటో చూద్దాం. 

నైట్‌ షిఫ్టుల్లో పనిచేసేవారికి సాధారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. ఉదాహరణకు అవి... ఛాతీలో మంట, అజీర్ణం,  మలబద్ధకం, ఆకలి తగ్గడం వంటి గాస్ట్రోఇంటస్టినల్‌ సమస్యతో పాటు రక్త΄ోటు, గుండెజబ్బులు, యాంగై్జటీ, ఒత్తిడి, డిప్రెషన్, నిద్రలేమి వంటివి రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారిలో కాస్తంత ఎక్కువగా కనిపించవచ్చు.

బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ..
నైట్‌ షిఫ్టుల్లో పనిచేసేవాళ్లలో బరువు పెరిగి స్థూలకాయం (ఒబేసిటీ) వచ్చే అవకాశాలూ ఎక్కువే. ఇందుకు కారణాలు ఏమిటంటే... సాధారణంగా పగటి డ్యూటీలు చేసేవారు రాత్రంతా నిద్ర΄ోవడం వల్ల మళ్లీ ఉదయం వరకు భోజనం తీసుకోరు. కానీ   రాత్రి డ్యూటీలు చేసేవారు రాత్రంతా మెలకువతో ఉండాల్సి రావడంతో మధ్య మధ్య ఆకలేస్తూ ఉంటుంది. దాంతో రాత్రివేళ్లలోనూ తినాల్సి వస్తుంటుంది. 
సాధారణంగా ఇలా రాత్రి వేళల్లో తినే ఆహారం కాస్తా మామూలు భోజనంలా కాకుండా కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలు, ఫాస్ట్‌ఫుడ్స్, జంక్‌ఫుడ్స్‌ వంటివే ఎక్కువ. అందుకే రాత్రివేళ పనిచేసేవారు తీసుకునే అసమతౌల్య ఆహారపు అలవాట్ల (అన్‌ బ్యాలెన్స్‌డ్‌ డయటరీ ΄ాటర్న్‌) కారణంగా ఒకపక్క కొవ్వుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ ఉండటం, మరో పక్క శారీరక శ్రమ లేక΄ోవడంతో  ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ. దాంతో ఆ ఒబేసిటీ కారణంగా వచ్చే ఆరోగ్యపరమైన ముప్పులు (హెల్త్‌ రిస్క్‌లు) ఎక్కువే. అలాంటి ముప్పు రాకూడదంటే 

ఆహారపరంగా పాటించాల్సి సూచనలివి... 
రాత్రివేళల్లో ఉద్యోగాలు / పనులు చేసేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా  వారికి వచ్చేందుకు అవకాశమున్న చాలా రకాల ఆరోగ్య సమస్యలనూ, ఇతరత్రా ముప్పుల ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. అందుకు అనువైన ఆహారపు అలవాట్లు ఇవి... 
æ నైట్‌షిఫ్టుల్లో పనిచేయడానికి వెళ్లేవారు... డ్యూటీకి వెళ్లే ముందర భోజనం చేసి వెళ్తుంటారు. వాళ్లు పెద్ద పెద్ద పరిమాణాల్లో తక్కువ సార్లు కాకుండా... చిన్న చిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకుంటూ ఉండాలి. చిన్న పరిమాణంలో తీసుకునే ఆహారాలు జీర్ణం కావడం తేలిక. దాంతో చాలారకాల గ్యాస్ట్రో ఇంటస్టినల్‌ సమస్యలు తేలిగ్గా నివారితమవుతాయి. 

  • తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు తక్కువగా ఉండాలి.  పీచుపదార్థాలు (డయటరీ ఫైబర్‌) ఎక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. 

  • ఆఫీసుల్లోని వెండింగ్‌ మెషిన్, కాఫెటేరియా వద్ద లభ్యమయ్యే ఆహారపదార్థాలకు సాధ్యమైనంతగా దూరంగా ఉండటమే మేలు. ఇంటిదగ్గర నుంచి తెచ్చుకున్న ఆహారాన్నే (హోమ్‌ మేడ్‌ ఫుడ్‌ను) తీసుకోవడమే మంచిది. 

  • ఒకవేళ కాఫెటేరియా ఫుడ్‌నే తీసుకోవాల్సి వస్తే... పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు అంటే... తాజా పండ్లు, సలాడ్స్, మొలకెత్తిన గింజలు, పొట్టుతో ఉన్న పప్పుధాన్యాలు, గింజధాన్యాలు (అంటే ఉదాహరణకు...పొట్టుతోనే ఉన్న గోధుమలతో చేసిన రోటీలు, మొక్కజొన్నలతో చేసిన పదార్థాలు, బ్రౌన్‌బ్రెడ్‌ శాండ్‌విచ్‌లు) వంటివి తీసుకోవడం మంచిది. కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, బాగా ఎక్కువగా వేయించిన వేపుళ్లు (ఫ్రెంచ్‌ ఫ్రైస్, సమోసాలు, చిప్స్‌) వంటి ఆహారాలను వీలైనంతవరకు తీసుకోక΄ోవడమే మేలు. 

  • రాత్రివేళల్లో తీపి పదార్థాలు, రిఫైన్డ్‌ ఫుడ్స్‌ (అంటే... క్యాండీలు, చాక్లెట్‌లు, వైట్‌ బ్రెడ్స్, బన్, పాస్తా, పిజ్జాలు, కూల్‌డ్రింక్స్‌) వంటి వాటిని సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటమే మంచిది. 

  • రాత్రివేళ పనిచేస్తుండేవారు వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి. పగటితో పోలిస్తే రాత్రి కాసంత చల్లగా ఉంటుంది కాబట్టి నీళ్లు తక్కువగా తీసుకుంటూ ఉంటారు. దీంతో డిహైడ్రేషన్‌ ముప్పు ఉంటుంది. కాబట్టి  నైట్‌ షిఫ్ట్‌లో తరచూ నీళ్లు తాగుతూ ఉండటం మంచిది. 

  • నైట్‌ షిప్టుల్లో పనిచేసేవారు కాఫీ, టీ లు చాలా ఎక్కువగా తాగుతుంటారు. నిద్రరాకుండా ఉండటానికీ అలాగే బ్రేక్‌ సమయాల్లో ఇలా టీ, కాఫీలు తాగడం చాలా సాధారణం. అయితే వాటికి వీలైనంతగా తగ్గించాలి. టీ, కాఫీలు తాగాలనిపించినప్పుడల్లా నీళ్లు తాగుతుండటం మేలు. 

  • రాత్రివేళల్లో పనిచేసేవారు చాలావరకు వ్యాయామాలకు దూరంగా ఉంటారు. రాత్రంతా డ్యూటీ చేయడంతో పొద్దున్నే ఇంటికెళ్లగానే నిద్రకు ఉపక్రమిస్తుంటారు. ఇక రాత్రి డ్యూటీకి వచ్చే తొందరలో వ్యాయామాలను వదిలేస్తుండటం కద్దు. అయితే ఇలాంటివాళ్లంతా తమ వర్క్‌షెడ్యూల్‌కు అనుగుణంగా రోజులోని ఏదో ఒక సమయంలో క్రమం తప్పకుండా ప్రతిరోజూ 45 – 60 నిమిషాల పాటు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. రాత్రి షిఫ్టుల్లో పని సమయంలో వారిని ఉత్సాహంగా ఉంచడానికి ఈ వ్యాయామం తోడ్పడుతుంది. పైగా వ్యాయామపు ఉత్సాహం వల్ల రాత్రి పని చేసేటప్పుడు తూగురావడం వంటివి జరగవు. ఈ వ్యాయామాల వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే రాత్రి డ్యూటీల కారణంగా బరువు పెరగడమూ  జరగదు. 

ఇదే వ్యాయామం రాత్రిపనివేళల్లో పనిచేయడం వల్ల కలిగే ఒత్తిడిని (స్ట్రెస్‌ను) నివారిస్తుంది. దాంతో అధిక రక్తపోటు (హైబీపీ), డిస్‌లిపిడేమియా (రక్తంలో కొలెస్ట్రాల్‌ పాళ్లు అసాధారణంగా పెరగడం) వంటి ముప్పులూ నివారితమవుతాయి.                          

(చదవండి: కోర్టులు ఆమెను గౌరవించాయి..! ఐనా ఆ ఒక్క ఉద్యోగమే కాదు..)

Advertisement
 
Advertisement
Advertisement