ఈ సండే సరదాగా 'కేసర్‌ పిస్తా దోసె' ట్రై చేయండిలా..! | Funday special: Prepare These Different Foods | Sakshi
Sakshi News home page

ఈ సండే సరదాగా 'కేసర్‌ పిస్తా దోసె' ట్రై చేయండిలా..!

Mar 22 2026 3:31 PM | Updated on Mar 22 2026 3:42 PM

Funday special: Prepare These Different Foods

కేసర్‌ పిస్తా దోసె

కావలసినవి: బియ్యం–ఒక కప్పు, మినపప్పు–పావు కప్పు , శనగపప్పు–ఒక టేబుల్‌ స్పూన్‌  , మెంతులు–ఒక టీ స్పూన్‌ , ఉప్పు– రుచికి సరిపడా, కుంకుమ పువ్వు–15, వేడి పాలు–2 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి– 2 టేబుల్‌ స్పూన్లు, ఏలకులు–3 (పొడి చేయాలి)
పిస్తా చట్నీ కోసం: పిస్తా–100 గ్రాములు, పచ్చి మిరకాయలు–2, తురిమిన కొబ్బరి–2 టేబుల్‌ స్పూన్లు, నిమ్మరసం–ఒక టీ స్పూన్‌ , జీలకర్ర పొడి–అర టీ స్పూన్, ఉప్పు –రుచికి సరిపడా. 

తయారీ: ముందుగా బియ్యం, మినప్పప్పు, శనగపప్పులను కలిపి ఆరు గంటలు నానబెట్టాలి. తర్వాత నీటిని వడకట్టి కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిని ఎనిమిది గంటల సేపు పులియబెట్టండి. తర్వాత పాలను వేడి చేసి అందులో కుంకుమ పువ్వు వేసి పావుగంట ఉంచండి. ఈ పాలను పులిసిన దోసెపిండిలో వేసి, బాగా కలపండి. అదే సమయంలో ఏలకుల పొడి కూడా కలపండి. అంతే దోసెపిండి రెడీ. స్టవ్‌ మీద పెనం పెట్టి నెయ్యితో దోసెలు వేసుకోవాలి.

పిస్తా చట్నీ తయారీ: పిస్తా, పచ్చి మిరపకాయలు, కొబ్బరి తురుము, నిమ్మరసం, జీలకర్ర, ఉప్పుని అన్నింటినీ కలిపి మిక్సీ పట్టండి. రుచికి సరిపడా ఉప్పు కలపండి. అంతే టేస్టీ పిస్తా చట్నీ రెడీ. ఈ వేడి వేడి దోసెలను ఈ చట్నీతో కలిపి తింటే రుచిగా ఉంటాయి.

రష్యన్‌  మష్రూమ్‌ జూలియన్‌ 
కావలసినవి:  పుట్టగొడుగు ముక్కలు–250 గ్రాములు 
ఉల్లిపాయ–1, వెల్లుల్లి రెబ్బలు–2, వెన్న–ఒకటిన్నర టేబుల్‌ స్పూ¯Œ  
హెవీ క్రీమ్‌–ముప్పావు కప్పు, మోజరెల్లా చీజ్‌– ఒక కప్పు (తురిమినది), మిరియాల పొడి–ఒక టీ స్పూన్, ఉప్పు– రుచికి సరిపడా. 

తయారీ: ముందుగా ఒక కడాయిలో టీ స్పూన్‌  వెన్న వేసి కరిగించండి. అందులో పుట్టగొడుగు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయండి. కాసేపు వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి కలపాలి. పుట్టగొడుగుల్లోని నీరు ఆవిరయ్యేంత వరకు వేయించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బయటకు తీసి చిన్న సిరామిక్స్‌ బౌల్స్‌లో వేయాలి. 

అదే పాన్‌లో అర టీస్పూన్‌  వెన్న వేసి కరిగించండి. అందులో హెవీ క్రీమ్‌ వేసి మిక్స్‌ చేయండి. ఇందులో మిరియాల పొడి, ఉప్పు వేసి సాస్‌లా బాగా కలపండి. ఈ సాస్‌ను ముందుగా రెడీ చేసిన పుట్టగొడుగుల మిశ్రమంలో వేసుకోవాలి. తర్వాత మోజరెల్లా చీజ్‌ కూడా వేయండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని 375 ఫారన్‌హీట్‌ డిగ్రీల దగ్గర ప్రీహీట్‌ చేసిన మైక్రోవేవ్‌ ఒవెన్‌లో 10 నుంచి 15 నిమిషాల పాటు బేక్‌ చేయండి. అంతే టేస్టీ రష్యన్‌  మష్రూమ్‌ జూలియన్‌ రెడీ.

ఛత్తీస్‌గఢీ ఫరా 
కావలసినవి: అన్నం–ఒక కప్పు, బియ్యప్పిండి–2 కప్పులు, ఎండు మిరపకాయలు–2, నువ్వులు–ఒక టేబుల్‌ స్పూన్‌ , జీలకర్ర– ఒక టేబుల్‌ స్పూన్, ఆవాలు–ఒక టీ స్పూన్‌ , కరివేపాకు–రెండు రెమ్మలు, 
పచ్చిమిర్చి–3 (ముక్కలుగా చేసుకోవాలి), కొత్తిమీర–కొద్దిగా, 
నూనె–తాలింపు కోసం, ఉప్పు–రుచికి సరిపడా.

తయారీ: ముందుగా వండిన అన్నాన్ని మెత్తగా మెదుపుకోవాలి. ఇందులో బియ్యప్పిండి, ఉప్పు, తురిమిన అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు, పుదీనా బాగా కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా నీళ్లు వేసి చపాతీ ముద్దలా తయారు చేసి కాసేపు ఉంచండి. 

ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని నిలువుగా చిత్రంలో చూపిన ఆకారంలో చుట్టుకోవాలి. వీటిని స్టీమర్‌ సాయంతో 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించండి. మరోవైపు పాన్‌ లో కొద్దిగా నూనె వేసి 2 ఎండు మిరపకాయలు, ఆవాలు, కరివేపాకు, నువ్వులు వేసి వేయించండి. ఇందులో ముందుగా తయారు చేసిన అన్నం మిశ్రమాన్ని వేసి రెండు నిమిషాలు వేయించండి. అంతే టేస్టీ ఫరా రెడీ. వీటిని పుదీనా చట్నీతో తింటే బాగుంటాయి. 

Advertisement
 
Advertisement
Advertisement