బడ్జెట్‌లో రక్షణ శాఖకు కేటాయింపులు పెంపు.. ఎన్ని కోట్లంటే..?

Union Budget 2023-24 Defence Ministry Allocation Increased - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో ఈ ఏడాది రక్షణ రంగానికి ప్రాధాన్యం లభించింది. మొత్తం రూ.5.94 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది కంటే రూ. 69 వేల కోట్లు ఎక్కువ. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెడు­తూ రక్షణ రంగ కేటాయింపుల్లో రూ. 1.62 లక్షల కోట్లు మూల ధన వ్యయమని తెలిపారు. ఈ మొత్తాన్ని కొత్త ఆయుధాలు, విమానాలు, యుద్ధనౌకలు, ఇతర మిలటరీ పరికరాల కొను­గోళ్లకు మాత్రమే ఉపయోగిస్తారన్నమాట.

2022–23 మూలధన కేటాయింపులు రూ.1.52 లక్ష కోట్లు మా­త్రమే. అంచనాల సవరణ తరువాత ఇది రూ.1.50 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది రక్షణ రంగ కేటాయింపుల్లో రూ.2.70 లక్షల కోట్లు ఆదాయ వ్యయం అంటే సిబ్బంది జీతభత్యాలు, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం ఖర్చు పెట్టనున్నారు. గత ఏడాది ఈ ఖర్చుల కోసం ముందుగా 2.39 లక్షల కోట్లు కేటాయించారు. మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌ (సివిల్‌) మూలధన వ్యయం రూ.8774 కోట్లు. ఫించన్ల కోసం విడిగా రూ.1.38 లక్షల కోట్లు కేటాయిపులు జరిగాయి. దీంతో రక్షణ శాఖ ఆదాయ వ్యయం మొత్తమ్మీద రూ.4.22 లక్షల కోట్లకు చేరింది.   

భద్రతకు పెద్దపీట
దేశంలో అంతర్గత భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా స్పష్టం చేసింది. బడ్జెట్‌లో కేంద్ర హోంశాఖకు ఏకంగా రూ.1,96,034.94 కోట్లు కేటాÆ­‡ుుంచడమే ఇందుకు నిదర్శనం. గత ఏడాది బడ్జెట్‌లో ఈ కేటాయింపులు రూ.1,85,­776.55 కోట్లు.  ఈసారి కేటాయింపులను రూ.10,258.39 కోట్లు పెంచినట్లు స్పష్టమవుతోంది. మొత్తం కేటాయింపుల్లో సింహభాగం కేంద్ర సాయుధ పోలీ­సు దళాలు, నిఘాసమాచారం సేకరణ కోసం ఖర్చు చేయనున్నారు. అంత­ర్జాతీయ సరిహద్దుల్లో మౌలిక సదు­పాయాల అభివృద్ధి, పోలీసు దళాల ఆధునీకరణ కోసం పెద్ద ఎత్తున వెచ్చించబోతున్నారు.  

మహిళా భద్రత పథకాలకు రూ.1,100 కోట్లు 
సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు దళాలకు గత ఏడాది రూ.1,19,070 కోట్లు కేటాయించగా ఈసారి రూ.1,27,756 కోట్లు కేటాయించారు. ఇందులో సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌)కు 2022–23లో రూ.31,495 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్‌లో రూ.31,772 కోట్లు కేటాయించారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌), కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్‌), సశస్త్ర సీమాబల్‌(ఎస్‌ఎస్‌బీ), ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీసు(ఐటీబీపీ), అస్సాం రైఫిల్స్‌ తదితర దళాలకు కేటాయింపులను పెంచారు.

నేషనల్‌ సెక్యూరిటీ గార్డు(ఎన్‌ఎస్‌జీ), ఇంటెలిజెన్స్‌ బ్యూరో, ప్రత్యేక భద్రతా విభాగం(ఎస్పీజీ)కి గణనీయమైన కేటాయింపులు లభించాయి. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.3,545.03 కోట్లు, పోలీసు మౌలిక సదుపాయాల కోసం రూ.3,636.66 కోట్లు, పోలీసు దళాల ఆధునీకరణ కోసం రూ.3,750 కోట్లు కేటాయించారు. భద్రతకు సంబంధించిన ఖర్చుల కోసం రూ.2,780.88 కోట్లు, జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన పనులకు రూ.1,564.65 కోట్లు, మహిళా భద్రత పథకాలకు రూ.1,100 కోట్లు, ఫోరెన్సిక్‌ సదుపాయాల ఆధునీకరణకు రూ.700 కోట్లు, సరిహద్దుల్లో చెక్‌పోస్టుల నిర్వహణకు రూ.350.61 కోట్లు,సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు దళాల ఆధునికీకరణ ప్రణాళిక–4 కోసం రూ.202.27 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.

అంతరిక్షానికి 12,544కోట్లు
అంతరిక్ష రంగానికి బడ్జెట్‌లో రూ.12,544 కోట్లు కేటాయించారు. ఈ కేటా­యింపులు గత ఏడాది ఇచ్చి­న రూ.13,700 కంటే 8 శాతం తక్కువ కావడం గమనార్హం. వచ్చే ఏడాది చంద్రుడు, చుట్టూ ఉన్న గ్రహాల అధ్యయనం కోసం మానవసహిత గగన్‌యాన్‌ను నిర్వహించేందుకు అంతరిక్ష విభాగం ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఇచ్చిన కేటాయింపుల్లో అధి­క­భాగం రూ.11,669.41 కోట్లను గగన్‌యాన్, శాటిలైట్‌ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఇస్తారు. థియరిటికల్‌ ఫిజిక్స్‌తోపాటు వివిధ అంశాలపై పరిశోధనలు నిర్వహించే అహ్మదాబాద్‌లోని ఫిజికల్‌ రీసెర్చ్‌ ల్యాబొరేటరీకి రూ.408.69 కోట్లు కేటాయించారు. ఈ విభాగానికి గత ఏడాది రూ.411.11 కోట్లు ఇచ్చారు. ప్రైవేట్‌ రంగాన్ని పర్యవేక్షించేందుకు కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసిన సింగిల్‌విండో విభాగమైన ఇన్‌–స్పేస్‌కు గత ఏడాది రూ.21 కోట్లు ఇవ్వగా, తాజా బడ్జెట్‌లో రూ.95 కోట్లను కేటాయించా రు. వచ్చే ఏడాది చంద్రయాన్‌ మిషన్‌ చేపడుతున్న ఇస్రో.. సూర్యుడు, శుక్రు డు, అంగారక గ్రహాలపైనా పరిశోధనలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.   

న్యూక్లియర్‌ ఎనర్జీకి బూస్ట్‌
అణు ఇంధన ఉత్పత్తి కెపాసిటీని పెంచేందుకు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించా­రు. న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌)కు గత బడ్జెట్‌­లో కన్నా రూ. 2,859 కోట్లు ఈ బడ్జెట్‌లో అధికంగా ఇచ్చారు. న్యూక్లియర్‌ ఎనర్జీకి బూస్ట్‌ నిచ్చేందుకు ఎన్‌పీసీఐఎల్‌ రూ. 9,410 కోట్లు ఈ బడ్జెట్‌ ద్వారా అందుకోనుంది. అంతర్గత, బహిర్గత వనరుల ద్వారా ఎన్‌పీసీఐఎల్‌ రూ. 12,863 కోట్లు సమకూర్చుకోనుంది. అటామిక్‌ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌కు రూ. 25,078.49 కోట్లు కేటాయించారు. దేశంలో 6,780 మెగావాట్ల సామర్థ్యంతో న్యూక్లియర్‌ ఎనర్జీ ప్లాంట్లు ఉన్నాయి. 2031 నాటికి ఈ సామర్థ్యాన్ని 15,700 మెగావాట్లకు పెంచే లక్ష్యంతో మరో 21 పవర్‌ జనరేషన్‌ యూనిట్లను స్థాపించనున్నారు.   

.
చదవండి: Union Budget 2023-24: పెరిగేవి, తగ్గేవి ఇవే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top