రిలయన్స్‌తో జతకట్టిన ‘టైమ్’ | TIME100 Next India Global Spotlight on Indian Leaders Reliance Partnership | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌తో జతకట్టిన ‘టైమ్’

Apr 24 2026 12:07 PM | Updated on Apr 24 2026 12:15 PM

TIME100 Next India Global Spotlight on Indian Leaders Reliance Partnership

‘టైమ్‌ 100 నెక్స్ట్ ఇండియా’ ప్రారంభం

ప్రపంచవ్యాప్తంగా ప్రభావశీల వ్యక్తులను గుర్తించడంలో అగ్రగామిగా ఉన్న ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ‘టైమ్’, భారతీయ యువశక్తిని విశ్వవ్యాప్తం చేసేందుకు సిద్ధమైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో తన ప్రతిష్టాత్మక ‘టైమ్‌ 100 నెక్స్ట్’ ఫ్రాంచైజీని తొలిసారిగా భారత్‌లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ‘టైమ్‌ 100 నెక్స్ట్ ఇండియా’ పేరుతో ఈ ఎడిషన్ ప్రారంభం కానుంది. న్యూయార్క్‌లో గురువారం జరిగిన వార్షిక ‘టైమ్‌ 100 గాలా' వేదికగా టైమ్ సీఈఓ జెస్సికా సిబ్లీ, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు నీతా అంబానీ ఈమేరకు ప్రకటన చేశారు.

ఏమిటీ టైమ్‌ 100 నెక్స్ట్ ఇండియా?

భారతదేశ భవిష్యత్తును దిశానిర్దేశం చేయగల 100 మంది అసాధారణ యువ నాయకులను ఈ జాబితా ద్వారా టైమ్ ఎడిటర్లు ప్రపంచానికి పరిచయం చేస్తారు. కళలు, సైన్స్, వ్యాపారం, క్రీడలు.. వంటి విభిన్న రంగాల్లో రాణిస్తున్న వారిని ఎంపిక చేస్తారు. కేవలం భారతీయులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులను కూడా ఈ జాబితాలో పరిగణనలోకి తీసుకుంటారు. ఈ జాబితాను ఆన్‌లైన్‌లో విడుదల చేయడంతో పాటు డిసెంబర్ 2026లో ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో అట్టహాసంగా నిర్వహించే గాలా ఈవెంట్‌లో వీరిని సత్కరిస్తారు.

భారతీయ ప్రతిభకు ప్రపంచ గుర్తింపు

ఈ భాగస్వామ్యంపై రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ హర్షం వ్యక్తం చేస్తూ, ఇది భారతీయ యువతకు లభించే గొప్ప గౌరవమని పేర్కొన్నారు. ‘తర్వాతి తరం ప్రతిభను, వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడం ద్వారా నవ భారతాన్ని నిర్మించేందుకు రిలయన్స్ కట్టుబడి ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమ అంశాలను భారత్‌కు తీసుకురావడం, భారత్‌లోని అత్యుత్తమ ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పడమే మా లక్ష్యం. ఈ క్రమంలో టైమ్‌తో కలిసి ముంబైలో ఈ వేడుకను నిర్వహించాలనుకోవడం గర్వంగా ఉంది’ అన్నారు. టైమ్ సీఈఓ జెస్సికా సిబ్లీ మాట్లాడుతూ, భారతీయ పరిశ్రమల్లో వస్తున్న మార్పులను, ప్రపంచ పురోగతిని నడిపిస్తున్న నాయకులను గుర్తించడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!

Advertisement
 
Advertisement
Advertisement