టెల్కోల ఆదాయాల్లో స్థిర వృద్ధి | Sakshi
Sakshi News home page

టెల్కోల ఆదాయాల్లో స్థిర వృద్ధి

Published Sat, Oct 22 2022 9:00 AM

Telecom Companies May See Stable Suv, 5G Update Key Focus Says Experts - Sakshi

న్యూఢిల్లీ: కొత్త యూజర్ల సంఖ్య మందగించినప్పటికీ ప్రస్తుత సబ్‌స్క్రయిబర్స్‌పై వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) మెరుగుపడటం, స్పెక్ట్రం యూసేజీ చార్జీల (ఎస్‌యూసీ) భారం కొంత తగ్గుతుండటం వంటి అంశాల కారణంగా రెండో త్రైమాసికంలో టెల్కోల ఆదాయాలు స్థిరమైన వృద్ధి నమోదు చేయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. త్రైమాసికాలవారీగా చూస్తే మార్జిన్లు పెరుగుతాయని టెల్కోల ఆదాయాల ప్రివ్యూ నివేదికలో బీవోఎఫ్‌ఏ సెక్యూరిటీస్‌ పేర్కొంది.

అటు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ‘రెవెన్యూ వృద్ధి స్థిరంగా‘ ఉంటుందని, ఎస్‌యూసీ తగ్గుదల వల్ల మార్జిన్లు ఎగియవచ్చని పేర్కొంది. ‘సవరించిన స్థూల ఆదాయంలో (ఏజీఆర్‌) ఎస్‌యూసీ 3–3.5 శాతంగా ఉండేది. ఈ ఏడాది జూలైలో కొనుగోలు చేసిన స్పెక్ట్రంపై ఇది నామమాత్రం స్థాయికి తగ్గిపోయింది. ఈ పూర్తి ప్రయోజనాలు మూడో త్రైమాసికంలో ప్రతిఫలించవచ్చు‘ అని తెలిపింది. ఏఆర్‌పీయూ త్రైమాసికాలవారీగా 1.5–3 శాతం మేర వృద్ధి చెందవచ్చని పేర్కొంది.  

మరోవైపు జెఫ్రీస్‌ కూడా దాదాపు ఇదే తరహా అంచనాలు ప్రకటించింది. రెండో త్రైమాసికంలో ఆదాయాల వృద్ధి స్థిరంగా ఉంటుందని, త్రైమాసికాలవారీగా భారతి/జియో ఆదాయ వృద్ధి 2–4 శాతం స్థాయిలో ఉండవచ్చని పేర్కొంది. రెండో త్రైమాసికంలో రోజులు ఎక్కువ ఉన్నందున సీక్వెన్షియల్‌గా ఏఆర్‌పీయూ 1–2 శాతం పెరగవచ్చని వివరించింది. అయితే, అంతక్రితం రెండు త్రైమాసికాలతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా టెల్కోల ఆదాయ వృద్ధి బలహీనంగా (2.4 శాతం స్థాయిలో) ఉండవచ్చని, వార్షికంగా చూస్తే మాత్రం 19 శాతం పెరుగుదల నమోదు కావచ్చని బీఎన్‌పీ పారిబా పేర్కొంది. టారిఫ్‌ల పెంపు ప్రయోజనాలు ఇప్పటికే లభించడం, కొత్తగా చేరే యూజర్ల సంఖ్య అంతంతమాత్రంగానే ఉండటం ఇందుకు కారణమని తెలిపింది.  

5జీపై దృష్టి.. 
అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందించే 5జీ సేవల విస్తరణ, పెట్టుబడులు, టారిఫ్‌లు తదితర అంశాలపై టెల్కోలు క్యూ2 ఫలితాల సందర్భంగా ఏం చెప్పబోతున్నాయన్న దానిపై నిపుణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారతి ఎయిర్‌టెల్‌ ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై తదితర 8 నగరాల్లో క్రమంగా 5జీ సేవలు విస్తరిస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిలో జియో ..  బీటా ట్రయల్స్‌ నిర్వహిస్తోంది. జియో 2023 డిసెంబర్‌ కల్లా దేశవ్యాప్తంగా 5జీ సర్వీసులు విస్తరించనున్నట్లు ప్రకటించగా, 2024 మార్చి నాటికి దీన్ని సాధించనున్నట్లు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది.అటు యాపిల్, శాంసంగ్‌ వంటి టాప్‌ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థలు .. భారత్‌లోని తమ 5జీ ఎనేబుల్డ్‌ ఫోన్లలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్‌ చేయనున్నాయి.

చదవండి: ‘అలా చేస్తే మీకే కాదు..నా ఉద్యోగానికే దిక్కుండదు’, రషీద్‌ ప్రేమ్‌జీ సంచలన వ్యాఖ్యలు

Advertisement
 
Advertisement
 
Advertisement