
హైదరాబాద్: రాష్ట్రంలో ఫుడ్, టూరిజం స్టార్టప్ లకు ఊతమిచ్చే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఆగస్టు ఫెస్ట్ కార్యక్రమంలో తెలంగాణ కలినరీ అండ్ ఎక్స్ పీరియన్షియల్ టూరిజం యాక్సిలరేటర్ ను పర్యాటక శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, టీజీఐసీ సీఈవో మెరాజ్ ఫహీమ్, ఎన్ ఐసీఈ కో ఫౌండర్ సంజయ్ ఆనందరామ్ ఆవిష్కరించారు.
తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ (టీజీఐసీ), నైస్‌ఆర్గ్, కలినరీ లాంజ్ ఆధ్వర్యంలో ఆరు నెలల పాటు సాగే ఈ కార్యక్రమం తెలంగాణ సాంస్కృతిక వారసత్వంలో పాతుకుపోయిన వ్యాపారాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందించేందుకు దోహదపడుతుంది.
స్టార్టప్ లకు నిపుణుల మార్గదర్శకత్వం, మార్కెట్ యాక్సెస్, నైస్‌ఆర్గ్ ఇన్వెస్టర్ నెట్ వర్క్ ద్వారా ఫండ్ రైజింగ్ సపోర్ట్ లభిస్తుంది. తెలంగాణ ఆహార, పర్యాటక అనుభవాలను ప్రోత్సహించడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి, సాంస్కృతిక వ్యవస్థాపకతకు రాష్ట్రాన్ని ప్రపంచ గమ్యస్థానంగా నిలబెట్టడానికి ఈ చొరవను రూపొందించారు.
ఈ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ స్థానిక వారసత్వాన్ని ఆర్థిక అవకాశంగా మారుస్తుందని, సంప్రదాయాన్ని సృజనాత్మకతతో మిళితం చేసి ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని అధికారులు చెబుతున్నారు.