
న్యూఢిల్లీ: ఇన్ పుట్ ఖర్చులు పెరగడం వల్ల తన ప్యాసింజర్ వాహన శ్రేణి ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు టాటా మోటార్స్ సోమవారం తెలిపింది. ఎప్పటి నుంచి పెరగనున్నయో స్పష్టంగా చెప్పకున్నప్పటికి "త్వరలో" పెరగనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వాహన తయారీలో ఉపయోగించే ఉక్కు, విలువైన లోహాలతో సహా ఆవశ్యక ముడి పదార్థాల ఖర్చులు పెరగడం వల్ల వాహన ధరలు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపింది. ధరల పెరుగుదల ఎంత అనేది రాబోయే రోజులు, వారాల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో టియాగో, నెక్సాన్, హారియర్ వంటి మోడల్స్ ను విక్రయిస్తుంది. ఆదివారం, హోండా కార్స్ ఆగస్టు నుంచి తన అన్నీ వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. గత కొన్ని నెలలుగా దేశంలో ఉక్కు ధరలు గణనీయంగా పెరిగాయి. జూన్ ల, ప్రముఖ దేశీయ ఉక్కు తయారీదారులు హాట్ రోల్డ్ కాయిల్ (హెచ్ఆర్ సీ), కోల్డ్ రోల్డ్ కాయిల్(సీఆర్ సీ) ధరలను వరుసగా టన్నుకు రూ.4,000, రూ.4,900 వరకు పెంచారు.
హెచ్ఆర్ సీ, సీఆర్ సీ అనేవి ఆటో, ఉపకరణాలు, నిర్మాణం వంటి పరిశ్రమల్లో ఉపయోగించే ఫ్లాట్ స్టీల్ ఉత్పత్తులు. అందువల్ల, ఉక్కు ధరల పెరుగుదల వాహనాలు, వినియోగదారు వస్తువుల, నిర్మాణ ఖర్చుల ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అంతేకాకుండా, రోడియం, పల్లాడియం వంటి విలువైన లోహాల ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి, ఇది ఉత్పత్తి ఖర్చును ప్రభావితం చేసింది. రోడియం, పల్లాడియంలను ఉత్ప్రేరకాలలో ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కఠినమైన ఉద్గార నిబంధనలను ప్రవేశపెట్టడం వల్ల వాటికి డిమాండ్ అనేక రెట్లు పెరిగింది.