వచ్చే వారం మార్కెట్లు మరింత స్పీడ్!?

Stock market may zoom in next week on FPI investments, vaccine hopes - Sakshi

ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల రికార్డ్

వచ్చే వారం డెరివేటివ్ సిరీస్ ముగింపు ఎఫెక్ట్

నిఫ్టీకి 12,970- 13,100 వద్ద రెసిస్టెన్స్

నిఫ్టీకి 12,630-12,530 వద్ద సపోర్ట్స్

విదేశీ మార్కెట్లు, కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఇన్వెస్టర్ల చూపు

ముంబై, సాక్షి: వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు మరింత బలపడే వీలున్నట్లు స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, కోవిడ్-19 కట్టడికి రూపొందుతున్న వ్యాక్సిన్ల ఫలితాలు  సహకరించనున్నట్లు పేర్కొంటున్నారు. అయితే గురువారం(26న) నవంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనున్న నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్లను చవిచూడవచ్చని తెలియజేశారు. ట్రేడర్లు డిసెంబర్ సిరీస్ కు పొజిషన్లను రోలోవర్ చేసుకోవడంలో మార్కెట్లు ఒడిదొడుకులను ఎదుర్కొనే వీలున్నట్లు వివరించారు.  కాగా.. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) నికరంగా ఈక్విటీలలో రూ. 42,300 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. గత రెండు దశాబ్దాలలోనే నవంబర్ పెట్టుబడుల్లో ఇది అత్యధికమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది దేశీయంగా ఇన్వెస్టర్లకు హుషారునిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. యూఎస్, యూరోపియన్ కేంద్ర బ్యాంకులు అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీల కారణంగా పెరిగిన లిక్విడిటీ దేశీయంగా విదేశీ పెట్టుబడులకు దోహదపడుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు.

సాంకేతికంగా..
గత వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలక అవరోధమైన 12,850 పాయింట్లకు పైనే నిలిచింది. దీంతో  వచ్చే వారం నిఫ్టీకి సాంకేతికంగా 12,970 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకాగలదని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. ఈ స్థాయిని అధిగమిస్తే.. 13,100- 13,200 పాయింట్ల వరకూ పుంజుకోగలదని పేర్కొన్నారు. అయితే 12,730 స్థాయిని నిలుపుకోవలసి ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ ఈ స్థాయిని కోల్పోతే.. 12,630- 12,530 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇతర అంశాలూ..
ప్రపంచ మార్కెట్ల నుంచి అందే సంకేతాలు, డాలరుతో రూపాయి కదలికలు వంటి అంశాలు సైతం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయగలవని స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. సెకండ్ వేవ్ లో భాగంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రపంచ ఇన్వెస్టర్లలో ఆందోళనలు నెలకొన్నట్లు తెలియజేశారు. అయితే తాజాగా ఫైజర్ అత్యవసర వినియోగానికి అనుమతించమంటూ  తమ వ్యాక్సిన్ పై యూఎస్ఎఫ్డీఏకు దరఖాస్తు చేయడం, మోడర్నా వ్యాక్సిన్ 94 శాతానికిపైగా సత్ఫలితాలు ఇచ్చినట్లు వెలువడిన వార్తలు వంటి అంశాలు అంతర్గతంగా సెంటిమెంటుకు బలాన్నివ్వగలదని విశ్లేషకులు చెబుతున్నారు. 

గత వారం ఇలా
శుక్రవారం(20)తో ముగిసిన గత వారంలో ఎఫ్‌ఐఐలు రూ. 13,019 కోట్లను ఇన్వె‍స్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌ రూ. 12,343 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. సెన్సెక్స్‌ 244 పాయింట్లు(0.6 శాతం) బలపడి 43,882 వద్ద నిలిచింది. అయితే ఇంట్రాడేలో 44,000 పాయింట్ల మైలురాయిని తొలిసారి అధిగమించింది. నిఫ్టీ 79 పాయింట్లు(0.6 శాతం) పుంజుకుని 12,859 వద్ద ముగిసింది. కాగా.. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 3 శాతం స్థాయిలో జంప్‌చేయడం గమనార్హం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top