
నేడు (30న) దేశీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 33 పాయింట్లు తక్కువగా 11,627 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ నవంబర్ ఫ్యూచర్స్ 11,670 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. భారీ నష్టాలనుంచి కోలుకున్న యూఎస్ మార్కెట్లు గురువారం 0.5-1.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. దేశీయంగా నేటి నుంచి నవంబర్ ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులు ప్రారంభంకానున్న నేపథ్యంలో మార్కెట్లు మిడ్‌సెషన్ నుంచీ పుంజుకునే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
మార్కెట్లు వీక్
పలు దేశాలలో మళ్లీ కోవిడ్-19 కేసులు ఉధృతమవుతున్న నేపథ్యంలో గురువారం దేశీ స్టాక్ మార్కెట్లకూ సెగ తగిలింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకే కట్టుబడటంతో సెన్సెక్స్ 173 పాయింట్లు క్షీణించి 39,750 వద్ద ముగిసింది. నిఫ్టీ 59 పాయింట్ల నష్టంతో 11,671 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,524వరకూ పతనమైంది. అయితే ఒక దశలో 40,010 వరకూ పుంజుకోవడం గమనార్హం! ఇదే విధంగా తొలుత నిఫ్టీ 11,607 దిగువకు చేరింది. తదుపరి 11,744 వరకూ ఎగసింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,603 పాయింట్ల వద్ద, తదుపరి 11,537 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,741 పాయింట్ల వద్ద, ఆపై 11,812 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ కనిపించవచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 23,830 పాయింట్ల వద్ద, తదుపరి 23,567 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 24,346 పాయింట్ల వద్ద, తదుపరి 24,601 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు.
ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 421 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) సైతం రూ. 253 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ విక్రయించాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 1,131 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు సైలంట్ అయిన సంగతి తెలిసిందే. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 3,515 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,571 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి.