
నేడు (21న) దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 42 పాయింట్లు బలపడి 11,937 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్స్ 11,895 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రతిపాదించిన 2.2 ట్రిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీని ఆమోదించేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రెసిడెంట్ ట్రంప్ పేర్కొనడంతో మంగళవారం యూఎస్ మార్కెట్లు 0.5 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ఈ బాటలో ప్రస్తుతం చైనా మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. దీంతో నేడు దేశీయంగానూ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే మూడు రోజులుగా మార్కెట్లు జోరందుకున్న నేపథ్యంలో కొంతమేర హెచ్చుతగ్గులు నమోదుకావచ్చని అంచనా వేశారు.
మూడో రోజూ..
మంగళవారం బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి ప్రస్తావించదగ్గ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 113 పాయింట్లు పుంజుకుని 40,544 వద్ద నిలిచింది. నిఫ్టీ 24 పాయింట్లు బలపడి 11,897 వద్ద స్థిరపడింది. తద్వారా వరుసగా మూడో రోజు లాభాలతో నిలిచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,732-40,306 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైంది. నిఫ్టీ 11,949- 11,837 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,840 పాయింట్ల వద్ద, తదుపరి 11,782 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,951 పాయింట్ల వద్ద, ఆపై 12,006 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ కనిపించవచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 24,097 పాయింట్ల వద్ద, తదుపరి 23,883 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 24,469 పాయింట్ల వద్ద, తదుపరి 24,625 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు.
ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,585 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,633 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1,657 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,622 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.