
నేడు(24న) దేశీ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల(గ్యాప్ డౌన్)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 141 పాయింట్లు పతనమై 11,007 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 11,148 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కోవిడ్-19 కేసులు పెరుగుతూనే ఉన్నప్పటికీ ప్రభుత్వ ప్యాకేజీపై కాంగ్రెస్‌లో సమన్వయం కుదరకపోవడంతో బుధవారం యూఎస్ మార్కెట్లు 2-3 శాతం మధ్య క్షీణించాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. 1.5-0.3 శాతం మధ్య నష్టాలతో ట్రేడవుతున్నాయి. అంతేకాకుండా సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్ నేడు ముగియనున్న కారణంగా దేశీ మార్కెట్లు నేడు మరోసారి ఆటుపోట్ల మధ్య కదలవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
చివరికి నష్టాలు
బుధవారం తొలుత హైజంప్ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 66 పాయింట్లు క్షీణించి 37,668 వద్ద నిలవగా.. నిఫ్టీ 22 పాయింట్లు తక్కువగా 11,132 వద్ద స్థిరపడింది. తొలుత సెన్సెక్స్ 400 పాయింట్లు ఎగసి 38,140ను తాకింది. మిడ్‌సెషన్‌కల్లా.. 400 పాయింట్లు పతనమై 37,313కు చేరింది. ఇదే విధంగా నిఫ్టీ ఇంట్రాడేలో 11,260 వద్ద గరిష్టాన్ని తాకగా.. 11,024 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,018 పాయింట్ల వద్ద, తదుపరి 10,903 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,253 పాయింట్ల వద్ద, ఆపై 11,374 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 20,878 పాయింట్ల వద్ద, తదుపరి 20,577 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 21,422 పాయింట్ల వద్ద, తదుపరి 21,666 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు.
ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,912 కోట్లకు మించి అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,629 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2,073 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 879 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 540 కోట్లు, డీఐఐలు రూ. 518 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.