నేడు మార్కెట్ల ఫ్లాట్‌ ఓపెనింగ్‌?! | Sakshi
Sakshi News home page

నేడు మార్కెట్ల ఫ్లాట్‌ ఓపెనింగ్‌?!

Published Wed, Nov 4 2020 8:45 AM

SGX Nifty indicates market may open flat today - Sakshi

నేడు (4న) దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే  అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 6 పాయింట్ల నామమాత్ర లాభంతో 11,829 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ నవంబర్‌ ఫ్యూచర్స్‌ 11,823 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. మంగళవారం యూఎస్‌, యూరొపియన్‌ మార్కెట్లు 2-2.5 శాతం మధ్య ఎగశాయి.  ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా నేడు మార్కెట్లలో కొంతమేర హెచ్చుతగ్గులు నమోదుకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

లాభాలతో
ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టుండి బలపడిన సెంటిమెంటుతో మంగళవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల దౌడుతీశాయి. సెన్సెక్స్‌ 504 పాయింట్లు జంప్‌చేసింది. వెరసి 40,000 పాయింట్ల మైలురాయి ఎగువన 40,261 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 144 పాయింట్లు జమ చేసుకుని 11,813 వద్ద నిలిచింది. ప్రపంచ దేశాల పారిశ్రామికోత్పత్తి పుంజుకోవడంతో ఒక్కసారిగా సెంటిమెంటుకు జోష్‌ వచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 40,355 వరకూ ఎగసింది. ఒక దశలో 39,953 దిగువకూ చేరింది. ఇక నిఫ్టీ 11,836 వద్ద గరిష్టాన్ని తాకగా.. 11,723 వద్ద కనిష్టాన్ని చవిచూసింది.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,746 పాయింట్ల వద్ద, తదుపరి 11,678 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,859 పాయింట్ల వద్ద, ఆపై 11,904 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్‌ కనిపించవచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 25,259 పాయింట్ల వద్ద, తదుపరి 24,835 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 25,934 పాయింట్ల వద్ద, తదుపరి 26,185 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,274 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1101 కోట్ల పెట్టుబడులను వెనక్కితీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 741 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  డీఐఐలు రూ. 534 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement