మళ్లీ ఒమిక్రాన్‌ భయాలు

Sensex falls 764, Nifty 205 points amid Omicron fears - Sakshi

లాభాల స్వీకరణతో మర్కెట్‌ క్రాష్‌

ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతలు

ఆగని ఎఫ్‌ఐఐల అమ్మకాలు 

765 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ 

నిఫ్టీ నష్టం 205 పాయింట్లు

రెండురోజుల ర్యాలీకి బ్రేక్‌

ముంబై: ఒమిక్రాన్‌ భయాలు మరోసారి తెరపైకి రావడంతో స్టాక్‌ మార్కెట్లో మరోసారి లాభాల స్వీకరణ చోటుకుంది. అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం షేర్లు మూడు నుంచి ఒకటిన్నర శాతం క్షీణించి సూచీల పతనాన్ని శాసించాయి. విదేశీ ఇన్వెస్టర్లు వరసగా పదో ట్రేడింగ్‌ సెషన్‌లో విక్రయాలు చేపట్టారు. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్‌ 765 పాయింట్లు నష్టపోయి 58000 దిగువున 57,696 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 205 పాయింట్లు పతనమైన 17,197 వద్ద నిలిచింది. దీంతో సూచీల రెండు రోజుల ర్యాలీకి అడ్డకట్టపడింది. ఒక్క మీడియా మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాల వెలువెత్తాయి. నష్టాల మార్కెట్లోనూ చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఫ్లాట్‌గా, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ అరశాతం లాభపడింది.

సెన్సెక్స్‌ సూచీలోని 30 షేర్లకు గానూ ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, టాటా స్టీల్, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు మాత్రమే లాభంతో గట్టెక్కాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,356 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీ ఇన్వెస్టర్లు రూ.1649 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ 14 పైసలు క్షీణించి 75.16 వద్ద స్థిరపడింది.  గత రెండు వారాలు నష్టాలను చవిచూసిన సూచీలు ఈ వారంలో లాభాల్ని మూటగట్టుకున్నాయి. వారం మొత్తంగా సెన్సెక్స్‌ 589 పాయింట్లు, నిఫ్టీ 170 పాయింట్లు లాభపడింది.

టెగా ఐపీవో సూపర్‌హిట్‌!!
మైనింగ్‌ రంగానికి అవసరమయ్యే ఉత్పత్తుల తయారీ సంస్థ టెగా ఇండస్ట్రీస్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీవో) భారీ స్థాయిలో ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. ఆఖరు రోజున 219.04 రెట్లు సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. ఎక్సే్ఛంజీల గణాంకాల ప్రకారం 95,68,636 షేర్లను విక్రయానికి ఉంచగా 2,09,58,69,600 షేర్లకు బిడ్లు వచ్చాయి. సంస్థాగతయేతర ఇన్వెస్టర్ల కేటగిరీ 666 రెట్లు, క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ బయ్యర్స్‌ (క్యూఐబీ) విభాగం 215 రెట్లు, రిటైల్‌ వ్యక్తిగత ఇన్వెస్టర్ల (ఆర్‌ఐఐ) కేటగిరీ 29 రెట్లు సబ్‌స్క్రయిబ్‌ అయ్యాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top