
విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి హుషారుగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్ లాభాల డబుల్ సెంచరీ చేసింది. 6 నెలల తదుపరి తిరిగి సాంకేతికంగా కీలకమైన 39,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం 165 పాయింట్లు జంప్‌చేసి 38,965 వద్ద కదులుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 11,513 వద్ద ట్రేడవుతోంది. వరుసగా రెండో రోజు సోమవారం యూఎస్ ఇండెక్సులు ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్ సరికొత్త గరిష్టాల వద్ద నిలవగా.. ఆసియాలోనూ ప్రస్తుతం సానుకూల ట్రెండ్ నెలకొంది. దీంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు తెలియజేశారు.
ఐటీ మాత్రమే
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ఐటీ మాత్రమే నామమాత్రంగా వెనకడుగు వేసింది. బ్యాంక్ నిఫ్టీ, ఆటో, ఫార్మా, మెటల్ 1-0.5 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో షేర్ల విభజన చేపట్టిన ఐషర్ మోటార్స్ 3 శాతం లాభపడగా.. ఇండస్‌ఇండ్, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, యాక్సిస్, ఎన్‌టీపీసీ, హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ, హీరో మోటో 2.2-1 శాతం మధ్య ఎగశాయి. అయితే యూపీఎల్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్‌ఫ్రాటెల్, బజాజ్ ఆటో, నెస్లే, అల్ట్రాటెక్, అదానీ పోర్ట్స్ 1-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.
ఫైనాన్స్ జోరు
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో మ్యాక్స్ ఫైనాన్స్, ఎల్‌ఐసీ హౌసింగ్, చోళమండలం, టాటా కెమ్, ఇండిగో, ఆర్‌బీఎల్ బ్యాంక్, ఐబీ హౌసింగ్, ఉజ్జీవన్, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్, డీఎల్‌ఎఫ్, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్, ముత్తూట్, శ్రీరామ్ ట్రాన్స్ 11-2 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క పేజ్, జూబిలెంట్ ఫుడ్, బీహెచ్‌ఈఎల్, బాలకృష్ణ, మైండ్‌ట్రీ, పీవీఆర్ 2-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.7 శాతం చొప్పున పెరిగాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1369 లాభపడగా.. 565 నష్టాలతో కదులుతున్నాయి.