SBI సమ్మె వాయిదా.. ఆ రెండు రోజులు బ్యాంక్‌ ఓపెన్‌ | SBI Strike Deferred Bank Branches To Operate Normally | Sakshi
Sakshi News home page

SBI సమ్మె వాయిదా.. ఆ రెండు రోజులు బ్యాంక్‌ ఓపెన్‌

May 23 2026 8:16 AM | Updated on May 23 2026 11:43 AM

SBI Strike Deferred Bank Branches To Operate Normally

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు పెద్ద ఉపశమనం లభించింది. ఈ నెల 25, 26 తేదీల్లో జరగాల్సిన దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె వాయిదా పడింది. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (AISBISF) ఈ సమ్మెను వాయిదా వేసినట్లు ఎస్‌బీఐ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.

ఈ మేరకు బ్యాంక్ ఒక కస్టమర్ అడ్వైజరీ (పత్రికా ప్రకటన) విడుదల చేసింది. మే 25, 26 తేదీలలో దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖలన్నీ యథావిధిగా పనిచేస్తాయని, బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసింది.

సమ్మెకు దారితీసిన కారణాలు ఏమిటి?

సిబ్బంది కొరత, అవుట్‌సోర్సింగ్ విధానం, పెన్షన్ సమస్యలు, వేతన అసమానతలపై 'ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్' సుదీర్ఘకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం విఫలమైందని, కార్మిక హక్కులను కాలరాస్తోందని యూనియన్ గతంలో ఆరోపించింది. ఈ క్రమంలోనే ప్రధానంగా 16 డిమాండ్లతో కూడిన చార్టర్‌ను యాజమాన్యం ముందు ఉంచింది.

ప్రధాన డిమాండ్లు ఇవే

» ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. మెసెంజర్లు, ఆర్మ్‌డ్ గార్డుల నియామకాలు చేపట్టాలి.
» ఆర్మ్‌డ్ గార్డుల కొరత వల్ల బ్రాంచ్‌లలో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి, వీటిని పరిష్కరించాలి.
» శాశ్వత ఉద్యోగాలను అవుట్‌సోర్సింగ్‌కు ఇవ్వడాన్ని పూర్తిగా నిలిపివేయాలి.
» నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద ఉద్యోగులకు మరింత సౌలభ్యాన్ని కల్పించాలి.
» 2019 తర్వాత రిక్రూట్ అయిన ఉద్యోగులకు ఇంటర్-సర్కిల్ బదిలీల అవకాశం కల్పించాలి. కెరీర్ ప్రొగ్రెషన్ ఫ్రేమ్‌వర్క్‌ను సమీక్షించాలి.
» పరిశ్రమ వ్యాప్తంగా సెటిల్‌మెంట్లు జరుగుతున్నప్పటికీ, అధికారులు, క్లరికల్/సబార్డినేట్ స్టాఫ్ వేతన పెంపులో తీవ్ర అసమానతలు ఉన్నాయి. వాటిని సరిచేయాలి.

వెనక్కి తగ్గిన యూనియన్

ఈ సమ్మెను విజయవంతం చేయడం కోసం ఫెడరేషన్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసన ప్రదర్శనలు, సోషల్ మీడియా ప్రచారాలు నిర్వహించింది. అంతేకాకుండా తమ సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు కూడా విజ్ఞాపన పత్రాలు పంపింది.

అయితే, సమ్మె తేదీలు దగ్గరపడుతుండటంతో ఎస్‌బీఐ యాజమాన్యం, ఉద్యోగ సంఘాల ప్రతినిధుల మధ్య జరిపిన చర్చలు సఫలమయ్యాయి. యాజమాన్యం సానుకూలంగా స్పందించడంతో ఫెడరేషన్ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా కోట్ల మంది ఎస్‌బీఐ కస్టమర్లకు బ్యాంకింగ్ సేవల పరంగా ఎదురుకాబోయే పెద్ద అంతరాయం తప్పినట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement