Reliance To Buy Revlon In US: దిగ్గజ కంపెనీపై కన్నేసిన రిలయన్స్‌

Reliance Considering Buying Out Revlon In US: Report - Sakshi

ముఖేశ్‌ అంబానీ చేతికి అమెరికన్ కాస్మొటిక్స్ దిగ్గజం?

సాక్షి, ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికాకు చెందిన కాస్మెటిక్స్ సంస్థ రెవ్లాన్‌ను సొంతం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దివాలా పిటిషన్‌ దాఖలు చేసిన రెవ్లాన్ కొనుగోలు చేసే అంశాల్ని పరిశీలిస్తోందన్న వార్తలు ప్రాధాన్యతను సంతరించు కున్నాయి. అయితే ఈ పరిణామాలపై రిలయన్స్ , రెవ్లాన్  ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 

రెవ్లాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్‌ను టేకోవర్ చేయడానికి ఆసియా కుబేరుడు,రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ సన్నాహాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది.   దీనికవసరమైన బిడ్డింగ్స్‌ దాఖలుకు  రిలయన్స్  సంప్రదింపులు కేడా మొదలు పెట్టినట్లు సమాచారం. గ్లోబల్ సరఫరా గొలుసు అంతరాయాలు ముడిసరుకు ఖర్చులను పెంచి, ముందస్తు చెల్లింపులను డిమాండ్ చేసేలా విక్రేతలను ప్రేరేపించిన తర్వాత ఈ వారం ప్రారంభంలో రెవ్‌లాన్ దివాలా కోసం దాఖలు చేసినట్లు నివేదిక వచ్చింది. టెలికాం, ఇంధనం, రిటైల్‌ రంగాల్లో సత్తా చాటుతూ దూసుకుపోతున్న రిలయన్స్ వ్యక్తిగత కాస్మొటిక్స్ సెగ్మెంట్‌లోకి కూడా   ప్రవేశించేందుకు పావులు కదుపుతోందన్నమాట. 

మరోవైపు రిలయన్స్ ఇటీవలి కాలంలో  భారీ విస్తరణ వ్యూహాల్లో ఉంది. ఇందులో భాగంగా  జాతీయంగా అంతర్జాతీయంగా పలు కంపెనీల కొనుగోలు ప్రయత్నాల్లో ఉంది. అపోలోతో పాటు,యూకే-ఫార్మసీ చైన్ బూట్స్ ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు  ఈ ఏడాది ప్రారంభంలో డన్జోలో వాటా కొనుగోలు చేసింది.

చార్లెస్‌ అండ్‌ బ్రదర్స్‌ నేతృత్వంలోని 1932లోఏర్పాటైన కాస్మొటిక్స్ కంపెనీ ఇది. నెయిల్ పాలిష్‌లు, లిప్‌స్టిక్‌లకు పేరుగాంచింది. ఎలిజబెత్ అర్డెన్, ఎలిజబెత్ టేలర్ పేరుతో స్కిన్ కేర్, మేకప్, పెర్‌ఫ్యూమ్స్ విక్రయిస్తుంది. 90 ఏళ్ల  నాటి  రెవ్లాన్‌  కంపెనీ అమెరికన్ బిలియనీర్ రాన్ పెరెల్‌మ్యాన్‌  సారధ్యంలో ప్రస్తుతం మొత్తం 15 బ్రాండ్లను ప్రమోట్ చేస్తోంది.  బ్యాంకు రుణాల భారం,  కాస్మొటిక్స్ సెగ్మెంట్‌లో నెలకొన్న తీవ్ర పోటీ వంటి కారణాలు కంపెనీని దెబ్బ తీశాయి. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి రెవ్లాన్ కంపెనీ రుణాలు 3.31 బిలియన్ డాలర్లు.   కాగా తాజా వార్తలతో రెవ్లాన్‌ షేరుకు మార్కెట్‌లో డిమాండ్‌ ఏర్పడింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top