క్రిప్టోకి ఎప్పటికీ నో ఎంట్రీ

RBI digital currency to be legal tender but others - Sakshi

నియంత్రణపై అంతర్జాతీయంగా ఏకాభిప్రాయం కీలకం

కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ డిజిటల్‌ కరెన్సీల చట్టబద్ధతపై స్పష్టతనిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీలు ఎన్నటికీ చట్టబద్ధంగా చెల్లుబాటు కాబోవని ఆయన స్పష్టం చేశారు. ‘క్రిప్టో ఎప్పటికీ లీగల్‌ టెండర్‌ కాబోదు. లీగల్‌ టెండర్‌ అంటే చట్టం ప్రకారం రుణాల సెటిల్మెంట్‌ కోసం ఆమోదయోగ్యమైనదని అర్థం. క్రిప్టో అసెట్ల విషయంలో భారత్‌ అలా చేయబోదు.

రిజర్వ్‌ బ్యాంక్‌ జారీ చేసే డిజిటల్‌ రూపీకి మాత్రమే లీగల్‌ టెండర్‌ హోదా ఉంటుంది‘ అని సోమనాథన్‌ పేర్కొన్నారు. బంగారం, వజ్రాలలాగే విలువైనవే అయినప్పటికీ వాటిలాగే ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీలకు అధికారిక గుర్తింపు ఉండదని తెలిపారు. 2022–23 బడ్జెట్‌లో వర్చువల్‌ డిజిటల్‌ అసెట్స్‌ మీద వచ్చే లాభాలపై 30 శాతం పన్నులు, నిర్దిష్ట పరిమాణానికి మించిన లావాదేవీలపై 1 శాతం ట్యాక్స్‌ డిడక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌ (టీడీఎస్‌) విధించేలా ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.

క్రిప్టో ఆదాయాలను వెల్లడించేందుకు ఆదాయ పన్ను రిటర్నుల్లో ప్రత్యేక కాలమ్‌ కూడా ఉండనుంది. గత శీతాకాల పార్లమెంటు సెషన్‌లో క్రిప్టో నియంత్రణ బిల్లును అంశాన్ని లిస్టు చేసినప్పటికీ .. తాజా బడ్జెట్‌ సెషన్‌ జాబితాలో దాన్ని చేర్చకపోవడంపై స్పందిస్తూ.. ‘దీన్ని చట్టం చేయడానికి ముందు నియంత్రణ స్వభావం ఎలా ఉండాలి, నియంత్రణ ఉండాలా లేక పన్ను మాత్రమే విధించాలా వంటి అంశాలపై మరింత విస్తృతంగా చర్చలు జరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది‘ అని ఆయన తెలిపారు.  

గ్లోబల్‌గా ఏకాభిప్రాయం కావాలి..
క్రిప్టోకరెన్సీలను నియంత్రించేందుకు దేశీయంగా తీసుకునే చర్యలు సరిపోవు కాబట్టి, ప్రపంచ దేశాల ఏకాభిప్రాయానికే భారత్‌ మొగ్గుచూపుతోందని ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అజయ్‌ సేఠ్‌ చెప్పారు. ఇలాంటి సాధనాలు ఏ జ్యూరిస్‌డిక్షన్‌ పరిధిలోకి రాకుండా ఆన్‌లైన్‌లో ట్రేడవుతుండటమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ‘నియంత్రించాలా లేదా నిషేధించాలా .. క్రిప్టో కరెన్సీల విషయంలో పాటించాల్సిన విధానాలపై కసరత్తు జరుగుతోంది. ఇవి ఎప్పటికీ తేలతాయన్నది ఇప్పుడే చెప్పలేను. ప్రస్తుత బడ్జెట్‌ సెషన్‌లో అయితే జరగకపోవచ్చని భావిస్తున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు. క్రిప్టోలను నియంత్రించడంపై చర్చలు జీ20 సదస్సులో ప్రారంభం కావచ్చని సేఠ్‌ పేర్కొన్నారు.

మరోవైపు, సీమాంతర లావాదేవీలు కూడా జరుగుతాయి కాబట్టి క్రిప్టోకరెన్సీల నియంత్రణపై అంతర్జాతీయంగా కూడా ఏకాభిప్రాయం అవసరమవుతుందని సోమనాథన్‌ చెప్పారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏదైనా ప్రతిపాదన చేశాక దానిపై అభిప్రాయాలు తీసుకుంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం అభిప్రాయాలు తీసుకుంటోంది. వాటి ఆధారంగా ఏం చేయాలి, ఎలా చేయాలన్న దానిపై తుది నిర్ణయానికి వస్తుంది. అయితే, అప్పటివరకూ పన్నులపై స్పష్టత ఇవ్వకుండా కూర్చోవడం కుదరదు. ఎందుకంటే, క్రిప్టో కరెన్సీల లావాదేవీల పరిమాణం భారీగా పెరిగిపోతోంది‘ అని ఆయన పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top