RBI: నోట్లతో పనిలేదు.. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే కాయిన్స్‌!

QR-based Coin Vending Machines Coming Up - Sakshi

చిల్లర సమస్యకు చెక్‌ పెడుతూ ముఖ్యంగా నాణేల చలామణిని ప్రోత్సహిస్తూ భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) సరికొత్త పరిష్కారాన్ని తీసుకొస్తోంది. కొన్ని ముఖ్యమైన బ్యాంకులతో కలిసి క్యూఆర్‌ కోడ్‌ బేస్డ్‌ కాయిన్‌ వెండింగ్‌ మిషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ద్రవ్య విధాన ప్రకటన సందర్భంగా తెలియజేశారు. ఎంపిక చేసిన 12 నగరాల్లోని 19 ప్రాంతాల్లో ఈ మిషన్లను పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

సాధారణంగా కాయిన్‌ వెండింగ్‌ మిషన్లలో మనం నోట్లు పెడితే అందుకు తగినంత నగదు నాణేల రూపంలో వస్తుంది. కానీ నోట్లు లేకుండా నగదు నాణేల రూపంలో కావాల్సినవారు  ఈ మిషన్ల ద్వారా పొందవచ్చు. ఇతర కాయిన్‌ వెండింగ్‌ మిషన్‌ల మాదిరిగా కాకుండా ఇది యూపీఐ వ్యవస్థ అనుసంధానంతో పనిచేస్తుంది. కాయిన్స్‌ కోసం నోట్లు ఇవ్వాల్సిన పనిలేదు. వినియోగదారులు క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి తమకు కావాల్సిన నాణేలు, అవసరమైన డినామినేషన్‌లో పొందవచ్చు.

పైలట్‌ ప్రాజక్ట్‌ కింద మొదట ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ మిషన్ల పనితీరు, ఉపయోగాన్ని పరిశీలించిన తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరించి నాణేల విస్తృత చలామణికి సంబంధించి బ్యాంకులకు గైడ్‌లైన్స్‌ ఇవ్వనున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ పేర్కొన్నారు. ఈ మిషన్లతో వినియోగదారులకు కాయిన్స్‌ కొరత తీరడమే కాకుండా నాణేల చలామణిని కూడా ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు.

(ఇదీ చదవండి: RBI: విదేశీయులూ యూపీఐ చెల్లింపులు చేయొచ్చు!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top