మరో రౌండ్‌ టెలికాం చార్జీల బాదుడు తప్పదు!

Private telcos to hike another round of tariffs: Crisil - Sakshi

టారిఫ్‌లు పెంచనున్న టెలికం సంస్థలు

2022-23లో 25 శాతం పెరగనున్న ఆదాయం 

క్రిసిల్‌ నివేదిక 

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో మూడు ప్రైవేట్‌ టెలికం దిగ్గజాలు (జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా) మరో విడత టారిఫ్‌లు పెంచే అవకాశాలు ఉన్నాయి. దీంతో 2022–23లో టెల్కోల ఆదాయాలు 20–25 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. దేశీ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. టెలికం సంస్థలు తమ నెట్‌వర్క్, స్పెక్ట్రంపై ఇన్వెస్ట్‌ చేయాలంటే సగటున ప్రతి యూజర్‌పై వచ్చే ఆదాయాన్ని (ఏఆర్‌పీయూ) మరింత పెంచుకోవాల్సి ఉంటుందని, అలా చేయకపోతే సర్వీసుల్లో నాణ్యత లోపించే అవకాశం ఉందని పేర్కొంది.

గత ఆర్థిక సంవత్సరంలో ఏఆర్‌పీయూ కేవలం 5 శాతం పెరిగిందని, అయితే ఇప్పటివరకూ పెంచినది.. ద్వితీయార్ధంలో పెంచబోయేది కూడా కలిపితే యూజరుపై ఆదాయం 15-20 శాతం మేర పెరగవచ్చని క్రిసిల్‌ తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరంలో టెలికం సంస్థలు నెట్‌వర్క్, స్పెక్ట్రంపై భారీగా వెచ్చించనున్నాయని.. ఏఆర్‌పీయూ వృద్ధి, టారిఫ్‌ల పెంపుతో వాటిపై ఆర్థిక భారం కొంత తగ్గగలదని పేర్కొంది.  ‘టాప్‌ 3 సంస్థల ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో 20-25% పెరిగే అవకాశం ఉంది. అలాగే నిర్వహణ లాభాల మార్జిన్‌ 1.80-2.20% పెరగవచ్చు‘ అని క్రిసిల్‌ వివరించింది. 

తగ్గిన యూజర్లు..: గత ఆర్థిక సంవత్సరంలో 3.70 కోట్ల ఇనాక్టివ్‌ యూజర్ల (పెద్దగా వినియోగంలో లేని కనెక్షన్లు) సంఖ్య తగ్గింది. యాక్టివ్‌ యూజర్లు (వినియోగంలో ఉన్న కనెక్షన్లు) 3 శాతం పెరిగారు. రిలయన్స్‌ జియో మొత్తం యూజర్ల సంఖ్య 2021 ఆగస్టు-2022 ఫిబ్రవరి మధ్య  భారీగా పడిపోయినప్పటికీ యాక్టివ్‌ యూజర్ల వాటా 94%కి పెరిగింది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో ఎయిర్‌టెల్‌ కనెక్షన్లు 1.10 కోట్ల మేర పెరగ్గా  యాక్టివ్‌ యూజర్ల వాటా 99%కి చేరింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top