వారెవ్వా ! వైన్‌తో నడిచే కారు.. యువరాజు కారంటే అంతేమరి!!

Prince Charles Says His Aston Martin Car Runs On Wine - Sakshi

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నేరం, అంటే మద్యం సేవించి కారు నడిపితే చట్ట ప్రకారం శిక్షార్హులు. కానీ కారే మద్యం సేవించి రోడ్లపై పరుగులు తీస్తే అది నేరమా? దానికేమైనా శిక్షలు ఉంటాయా? అసలు అది సాధ్యమా ? అంటే అవుననే అంటున్నారు యువరాజా వారు. అనడమే కాదు నిజం చేసి చూపించారు కూడాను. అసలు కారేంటి, అది వైన్‌ తాగడమేంటీ అనే సందేహాలు వస్తున్నాయా? అయితే ఈ వివరాలేంటో మీరే చూడండి.

అది అలాంటి ఇలాంటి కారు కాదు. రాజుగారు వాడే కారు. ఆయనేమో సామాన్యమైన రాజు కాదు,  ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరొందిన బ్రిటీష్‌ రాజవంశపు కాబోయే చక్రవర్తి. అందుకే ఈ కారు నడిచేందుకు పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ గ్యాస్‌లు ఉపయోగించడం లేదు. అంతకు మించి మనమెవరం ఊహించలేని ఇంధనాన్ని ఈ కారు నడిపేందుకు ఉపయోగిస్తున్నారు.  ఈ విషయాన్ని ఇటీవల ఆయనే స్వయంగా వివరించారు.

కొత్త ఐడియా
కార్లను కనిపెట్టినప్పటి నుంచి నిన్నా మొన్నటి వరకు అవి నడిచేందుకు ఫ్యూయల్‌గా వాడేది డీజిల్‌ లేదా పెట్రోల్‌లను ఉపయోగించారు.  ఆ తర్వాత కాలంలో ఈ రెండు ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వచ్చింది సీఎన్‌జీ గ్యాస్‌. అయితే వాతావరణ కాలుష్యం తగ్గించే లక్ష్యంతో ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ కార్లు వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇంగ్లీష్‌ రాజుగారు మరో అడుగు ముందుకు వేసి సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. పెట్రోలు , డీజిల్‌ బదులు వైన్‌తో నడిపిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేశారు. వెంటనే తన సిబ్బందిని పిలిపించి ఆదేశాలు జారీ చేశారు.  

అస్టోన్‌ మార్టిన్‌
బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ ఛార్లెస్‌కి 21వ ఏటా ఆస్టోన్‌మార్టిన్‌ కారుని బహుమతిగా అందుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఈ యువరాజు గ్యారేజీలో మరెన్నో కార్లు వచ్చి చేరినా సరే ఆ పాత ఆస్టోన్‌ మార్టిన్‌ కారు వన్నె తగ్గలేదు. రాజుగారికి దానిపై మోజు పోలేదు. అందుకే వీలు చిక్కినప్పుడల్లా ఆ కారులో చక్కర్లు కొడుతూనే ఉంటారు. తన మనసులో మాట చెప్పేందుకు ఈ కారునే రాజుగారు ఎంచుకున్నారు.

వైన్‌ ఉంటే చాలు
యువరాజు ఆజ్ఞలకు తగ్గట్టుగా కారుని రీ డిజైన్‌ చేశారు ఇంజనీర్లు. వారి కృషి ఫలించి ప్రస్తుతం రాజుగారి కారు వైన్‌తో నడుస్తోంది.  బకింగ్‌హామ్‌ ప్యాలేస్‌లో మిగిలిపోయిన వైన్‌ని ఈ కారు నడిపేందుకు ఉపయోగిస్తున్నారు. కొన్ని సార్లు జున్ను తయారు చేస్తుండగా విరిగిపోయిన పాలను సైతం ఈ కారులో ఫ్యూయల్‌గా వాడుతున్నారు.  ఈ విషయాలను స్వయంగా ప్రిన్స్‌ ఛార్లెస్‌ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.  ‘ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అక్టోబరు 31న వాతావరణ మార్పులపై సమావేశం జరగనుంది. కర్బణ ఉద్ఘారాలు తగ్గించేందుకు ప్రపంచ నాయకులు చేస్తున్న కృషికి నా వంతు సహాకారం అందించేందుకు పెట్రోలు, డీజిల్‌ బదులు వైన్‌ను ఉపయోగిస్తున్నాను’ అంటూ ఆయన తెలిపారు. 

కాలుష్యమే కారణం
ఇటీవల వాతావరణ కాలుష్యంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. కర్బణ ఉద్ఘారాలను తగ్గించాలంటూ ప్రపంచ దేశాలన్నీ నిర్ణయిస్తున్నాయి. వాతావరణ కాలుష్యంపై ప్రపంచం మొత్తం గగ్గోలు పెడుతున్నా.. బ్రిటీష్‌ యువరాజు ఇప్పటి వరకు స్పందించలేదు,. దీంతో ఆయనపై  చాలా విమర్శలు లోగడ వచ్చాయి. దీంతో తనపై ఉన్న ముద్రను చెరిపేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందరిలా ఎలక్ట్రిక్‌ కార్లంటే రాయల్‌ రేంజ్‌ ఏముంటుంది అనుకున్నారో ఏమో?  ‘గ్లోబల్‌ వార్మింగ్‌’ ప్రచారానికి ఊతం ఇచ్చేందుకు కర్బన ఉద్ఘారాలను వెదజల్లని వైన్‌ కారు ఫార్ములాను యువరాజు ఎంచుకున్నారు. అయితే రాజుగారి నిర్ణయంపై గ్లోబల్‌ లీడర్ల నుంచి పెద్దగా స్పందన లేకున్నా సోషల్‌ మీడియాలో ఫన్నీ మీమ్స్‌ వెల్లువెత్తుతున్నాయి. 

చదవండి :ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి శుభవార్త.. ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్! 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top