పెట్రోల్‌ ధరలు పెరగొచ్చా..? స్పందించిన కేంద్రం | Petrol And Diesel Prices May Rise By Rs 25-28 per Litre After Elections Report, Check Details About New Prices | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ ధరలు పెరగొచ్చా..? స్పందించిన కేంద్రం

Apr 23 2026 11:42 AM | Updated on Apr 23 2026 12:37 PM

Petrol diesel prices may rise by Rs 25-28 per litre after elections report

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడం భారత చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ప్రతిష్టంభన కారణంగా బ్రెంట్ ముడి చమురు ధర ప్రస్తుతం బ్యారెల్‌కు 104 డాలర్లకు చేరుకుంది.

కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ (KIE) తాజా నివేదిక ప్రకారం.. దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే (ఏప్రిల్ 29 తర్వాత) ఇంధన ధరల పెంపు తప్పకపోవచ్చు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడం, వాణిజ్య నౌకలపై దాడులు పెరగడం మార్కెట్‌లో ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో 20%, భారత దిగుమతుల్లో 40% వాటా ఉన్న హోర్ముజ్ మార్గం మూతపడటంతో సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింది.

ప్రస్తుతం చమురు సంస్థలు నెలకు సుమారు రూ. 27,000 కోట్ల అదనపు భారాన్ని మోస్తున్నాయని అంచనా. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరుగుతున్నప్పటికీ, దేశీయంగా రిటైల్ ధరలను ప్రభుత్వం ఇప్పటివరకు పెంచలేదు. అయితే, రిఫైనర్ల నష్టాలను తగ్గించాలంటే ధరల పెంపు అనివార్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా, అది ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సరిపోవడం లేదని తెలుస్తోంది.

ఒకవేళ పశ్చిమాసియాలో కాల్పుల విరమణ జరగని పక్షంలో, పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 25 నుండి రూ. 28 వరకు పెరిగే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ హెచ్చరించింది. భారత ముడి చమురు బాస్కెట్ ధర 120 డాలర్లకు చేరితే, సామాన్యులపై ఈ భారం మరింత తీవ్రంగా ఉంటుంది.

స్పందించిన ప్రభుత్వం
పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ‘ఎక్స్‌’ వేదికగా స్పష్టత ఇచ్చింది.  ఆ వార్తల్లో వాస్తవం లేదని, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement