
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సంబంధిత మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కొందరు నిపుణులు భావిస్తున్నారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) పుల్ ట్రాన్సాక్షన్స్ అని పిలువబడే పర్సన్-టు-పర్సన్ (పీ 2 పీ) డిజిటల్ చెల్లింపులను నిలిపివేయాలని చూస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఈ విషయం తెలిసిన వారిని ఉటంకిస్తూ కొన్ని సంస్థలు వార్తా కథనాలు ప్రచురిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని ఎన్‌పీసీఐ ఇప్పటికే బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలకు తెలియజేసినట్లు అందులో తెలిపాయి. యూపీఐ యాక్టివిటీలో పీ2పీ పుల్ ట్రాన్సాక్షన్స్ కేవలం 3% మాత్రమే ఉన్నాయని, తద్వారా ఎన్‌పీసీఐ ఈ ఫీచర్‌ను ఉపసంహరించుకోవడం సులభమవుతుందని పరిశ్రమ వర్గాలు తెలుపుతున్నాయి.
యూపీఐ పుల్ ట్రాన్సాక్షన్ ఫీచర్ అంటే ఏమిటి?
యూపీఐ పుల్ లావాదేవీని కలెక్ట్ రిక్వెస్ట్ అని కూడా పిలుస్తారు. ఏదైనా షాపుకు వెళ్లి సాధారణంగా క్యూఆర్ స్కాన్ చేసి మనీ పంపాలనుకునేవారు ఎంత మొత్తం చెల్లించాలో ఎంటర్ చేసి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అందుకు భిన్నంగా కొన్ని సందర్భాల్లో డబ్బు తీసుకునేవారే ఎంత కావాలో ఓటీపీ, బార్‌కోడ్, మెసేజ్ లింక్ రూపంలో రెక్వెస్ట్ పంపిస్తారు. దాన్ని క్లిక్ చేసి డబ్బు పంపాలనుకునేవారు యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే వెంటనే మనీ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు గ్రహీతలు మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. దాన్ని గ్రహించలేక ఎదుటివారు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. పైగా యూపీఐ మొత్తం లావాదేవీల్లో ఇది 3 శాతం మాత్రమే. ఎన్‌పీసీఐ దీని నిర్వహణ ఖర్చులు భరించాల్సి వస్తోంది. కాబట్టి దీన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని చూస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొందరు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ముఖేశ్ అంబానీ ఏం చదివారో తెలుసా?
ఇదిలాఉండగా, ఇటీవల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ భారతదేశంలో ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. 2025 ఆగస్టు 2న ఒకే రోజులో ఏకంగా 70 కోట్ల కంటే ఎక్కువ లావాదేవీలను నమోదు చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా UPI చాలా వేగంగా ముందుకు సాగుతోంది. 2023 నుంచి దాని రోజువారీ వినియోగాన్ని రెట్టింపు చేసింది. అప్పట్లో, ఇది రోజుకు దాదాపు 35 కోట్లు లావాదేవీలను నిర్వహించేది. ఆ సంఖ్య ఆగస్టు 2024 నాటికి 50 కోట్లకు చేరింది. కాగా ఇప్పుడు తాజాగా ఇది 70 కోట్ల మైలురాయిని చేరుకుంది. అయితే వచ్చే ఏడాది నాటికి 100 కోట్ల లావాదేవీలను చేరుకోవాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.