ఫ్లెక్స్‌ ఫ్యుయల్‌ వాహనాలను ప్రోత్సహించాలి

Nitin Gadkari Says India Needs To Promote Flex Fuel Vehicles To Tide Over Fluctuations In Crude Oil Prices - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పరంగా తీవ్ర ఒడిదుడుకులు ఉంటున్నందున ఫ్లెక్స్‌ ఫ్యుయల్స్‌ (ఇంధన వినియోగ సౌలభ్యం ఉన్నవి), ఎలక్ట్రిక్‌  వాహనాలను (ఈ రవాణా/ఈవీ) ప్రోత్సహించాలని కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీలో సియామ్‌ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. అధిక ఇంధన ధరలతో ఏవియేషన్‌ పరిశ్రమ కూడా సమస్యలను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ‘‘ఏటా చమురు ధరల్లో తీవ్ర అస్థిరతలు సమస్యలకు కారణమవుతున్నాయి.

అందుకే నూరు శాతం ఫ్లెక్స్‌ ఫ్యూయల్స్‌కు మారాలి’’అని పేర్కొన్నారు. ఫ్లెక్స్‌ ఫ్యుయల్‌ వాహనాలు అన్నవి ఒకటికి మించిన ఇంధనాలు, ఇంధన మిశ్రమాలతో నడిచేవి. పెట్రోల్‌లో ఇతర ఇంధనాలను కలిపినప్పుడు ఈ వాహనాలు ఎటువంటి సమస్యల్లేకుండా సులభంగా నడుస్తుంటాయి. ఇందుకు ఇంజన్‌ టెక్నాలజీ, ఇతర వ్యవస్థల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది.

దేశంలో వాయు కాలుష్యంలో 40 శాతం శిలాజ ఇంధనాల వినియోగం వల్లేనని మంత్రి గడ్కరీ చెప్పారు. చెత్త నుంచి సంపద సృష్టించే టెక్నాలజీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇథనాల్‌ తయారీని ప్రారంభించేందుకు ఎన్నో పరిశ్రమలను తాము ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. దేశంలో ఉపాధి కల్పనలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఆటోమొబైల్‌ రంగాన్ని మంత్రి ఈ కార్యక్రమం వేదికగా అభినందించారు. ‘‘ఆటోమొబైల్‌ దేశంలో 4 కోట్ల మందికి ఉపాధినిస్తోంది. ప్రభుత్వానికి అధిక జీఎస్‌టీ రూపంలో ఆదాయాన్ని సమకూరుస్తోంది’’అని చెప్పారు. ఆటోమొబైల్‌ విడిభాగాల ఎగుమతులకు భారీ అవకాశాలున్నట్టు చెప్పారు. 

చదవండి: లేడీ బాస్‌ సర్‌ప్రైజ్‌ బోనస్‌ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top