ట్రక్కు డ్రైవర్లకు కొత్త భవనాలు.. ప్రధాని కీలక నిర్ణయం | Sakshi
Sakshi News home page

ట్రక్కు డ్రైవర్లకు కొత్త భవనాలు.. ప్రధాని నిర్ణయం

Published Sat, Feb 3 2024 8:55 AM

New Buildings On Highways For Truck Drivers - Sakshi

హైవేలపై ట్రక్కు, ట్యాక్సీ డ్రైవర్ల కోసం ఆధునిక సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు , మొదటి దశలో 1,000 భవనాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానిమోదీ తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వం కొత్త పథకాన్ని రూపొందిస్తోందని ప్రధాని శుక్రవారం అన్నారు. 

భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2024 సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. ‘వాహన రంగంలో డ్రైవర్లది కీలక పాత్ర. చాలా గంటల పాటు వాహనాన్ని నడుపుతుంటారు. కానీ వాళ్లకు సరైన విశ్రాంతి ప్రాంతం దొరకడం లేదు. సరైన విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల రహదారి ప్రమాదాలకు దారి తీస్తోంది. దాంతో వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రభుత్వం వారి బాధను అర్థం చేసుకుంది’ అన్నారు.

ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్తపథకంలో భాగంగా ఏర్పాటు చేసే ప్రత్యేక భవనాల్లో ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ వసతులు ఉండనున్నాయి. డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా అన్ని వసతులు అభివృద్ధి చేయనున్నట్లు మోడీ చెప్పారు. ఈ పథకంలో భాగంగా మొదటి దశలో దేశవ్యాప్తంగా 1,000 భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిపారు.

ఇదీ చదవండి: సామాన్యులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌‌!

అక్టోబర్ 1, 2025న లేదా ఆ తర్వాత తయారు చేసే అన్ని కొత్త ట్రక్కుల్లో డ్రైవర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్‌లను ఏర్పాటు చేసేలా రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు రోజుల పాటు జరిగే ఈ భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2024లో 50కి పైగా దేశాల నుంచి 800 మంది ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారు.

Advertisement
 
Advertisement