ప్రపంచంలో ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకున్న పాపులర్ యాప్స్ ఇవే! మీకు తెలుసా? | Most Popular Downloading Apps In The World | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకున్న పాపులర్ యాప్స్ ఇవే! మీకు తెలుసా?

Published Sat, Nov 11 2023 8:01 PM | Last Updated on Sat, Nov 11 2023 8:13 PM

Most Popular Downloading Apps In The World - Sakshi

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో 'స్మార్ట్‌ఫోన్' జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. డిజిటల్ ప్రపంచంలో మొబైల్స్ ఎంత వేగంగా అప్డేట్ అవుతున్నాయి, వాటికి అనుగుణంగా కొత్త కొత్త యాప్స్ పుట్టుకొచ్చాయి. ఇప్పటి వరకు వచ్చిన యాప్‌లలో ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్ ఏవి? వాటి వివరాలు ఏంటి అనే సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

2022లో జనాదరణ పొందిన యాప్స్
2020లో భారత్ నిషేదించిన 'టిక్‌టాక్' 2022లో ఎక్కువ మంది డౌన్‌లోడ్‌ చేసుకున్న పాపులర్ ఎంటర్‌టైన్‌మెంట్ యాప్. ఈ వీడియో ప్లాట్‌ఫామ్‌ను ఏకంగా 672 మిలియన్ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు సమాచారం. బిజినెస్ ఆఫ్ యాప్స్ ప్రకారం దీని వార్షిక ఆదాయం 9.4 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. (భారతీయ కరెన్సీ ప్రకారం ఇది రూ. 783 వేల కోట్ల కంటే ఎక్కువ)

ఇక అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న టాప్ 5 సోషల్ మీడియా యాప్‌ల స్థానంలో ఇన్‌స్టాగ్రామ్ (547 మిలియన్స్), ఫేస్‌బుక్ (449 మిలియన్స్), వాట్సాప్‌ (424 మిలియన్స్), టెలిగ్రామ్ (310 మిలియన్స్), ఫేస్‌బుక్ మెసెంజర్ (210 మిలియన్స్) ఉన్నాయి.

షాపింగ్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది యూజర్స్ డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌గా 'షీఇన్' (Shein) నిలిచింది. ఈ యాప్‌ సుమారు 229 మిలియన్ల వినియోగదారులు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఆ తరువాత స్థానంలో మీషో (Meesho) 210 మిలియన్స్ డౌన్లోడ్స్ పొందింది. భారతదేశంలో కూడా ఈ యాప్ ఎక్కువమంది వినియోగిస్తున్నట్లు సమాచారం.

గేమ్స్ విభాగంలో ఎక్కువ మంది యూజర్లను ఆకర్శించిన యాప్ 'సబ్వే సర్ఫర్స్' (Subway Surfers). దీనిని 304 మిలియన్ల వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 'క్యాండీ క్రష్'ను ప్రపంచ వ్యాప్తంగా 138 మిలియన్ల యూజర్లు వినియోగిస్తున్నట్లు సమాచారం.

మనీ ట్రాన్స్‌ఫ‌ర్‌ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్స్ వాడుతున్న యాప్‌గా 'ఫోన్ పే' (PhonePe) నిలిచి సుమారు 94 మిలియన్ల డౌన్‌లోడ్స్ పొందింది. ఆ తరువాత పేపాల్ (92 మిలియన్స్), గూగుల్ పే (69 మిలియన్స్), పేటీఎమ్ (60 మిలియన్స్) వంటివి ఉన్నాయి.

ట్రావెల్ విభాగంలో గూగుల్ మ్యాప్ (113 మిలియన్స్), ఫుడ్ విభాగంలో ఎంసీడోనాల్డ్ (127 మిలియన్స్), మ్యూజిక్ విభాగంలో స్పాటిఫై (238 మిలియన్స్), విద్యకు సంబంధించిన యాప్‌లో డుయోలింగో (98 మిలియన్స్), ఆరోగ్యానికి సంబంధించిన విభాగంలో స్వెట్‌కాయిన్ (52 మిలియన్స్) అగ్ర స్థానాల్లో నిలిచాయి.

ఇదీ చదవండి: కోడలి గురించి 'సుధామూర్తి' మనసులో మాట - ఏం చెప్పిందంటే?

ఏఐ యాప్‌లకు పెరిగిన ఆదరణ
ప్రస్తుతం టెక్నాలజీ మరింత వేగంగా ఉంది. ఈ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ ఉపయోగించడానికి వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. నేడు ఏ ప్రశ్నకు సమాధానం కావాలన్నా వెంటనే 'చాట్‌జీపీటీ' మీద ఆధారపడిపోతున్నారు. రానున్న రోజుల్లో వీటి ఆదరణ మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement