
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల భారతదేశంలో మారుతి సుజుకి తయారు చేసిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-విటారా'ను ప్రారంభించారు. ఈ మోడల్ కార్లను కంపెనీ 12 యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధమైంది. గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా నిర్మించిన 2,900 ఈ-విటారా యూనిట్లను సంస్థ తరలించింది. కాగా ఇక్కడి నుంచే కంపెనీ 100 దేశాలకు ఎగుమతి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
మొట్టమొదటి మారుతి సుజుకి ఈ-విటారా షిప్‌మెంట్‌లను.. రాష్ట్రంలోని పిపాపావ్ పోర్టు నుంచి యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, నార్వే, డెన్మార్క్, నెదర్లాండ్స్, స్వీడన్, హంగేరీ, ఐస్లాండ్, బెల్జియంలకు పంపించారు. ఇప్పటికే సుజుకి స్వదేశమైన జపాన్‌తో సహా దాదాపు 100 దేశాలకు తన 17 ఇతర కార్లను ఎగుమతి చేస్తోంది.
ప్రతి సంవత్సరం 50,000 నుంచి 1,00,000 ఈ-విటారాలను కంపెనీ చేయనున్నట్లు మారుతి చైర్మన్ ఆర్‌సీ భార్గవ పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధమైన సామర్థ్యంతో, గుజరాత్ ప్లాంట్ ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ కేంద్రాలలో ఒకటిగా మారబోతోందని సుజుకి మోటార్ కార్పొరేషన్ సిఓ తోషిహిరో సుజుకి ప్రస్తావించారు. ప్రస్తుతం ఇక్కడ మూడు ఉత్పత్తి లైన్లలో సంవత్సరానికి 7,50,000 వాహనాలను ఉత్పత్తి చేయగలదు.
ఇదీ చదవండి: చైనా బ్రాండ్ కార్లు.. 10వేల మంది కొన్నారు
మారుతి ఈ-విటారా ప్రస్తుతం ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది. కానీ దేశీయ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే ఇది భారతీయ వినియోగదారులకు ఉపయోగపడేలా.. తయారవుతుందని కంపెనీ చెబుతోంది. ఇది అత్యాధునిక డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుందని సమాచారం. దీని ధర రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని చెబుతున్నారు. అయితే ధరలు అధికారికంగా.. లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.