
ప్రముఖ చైనా వాహన తయారీ సంస్థ అయిన బీవైడీ.. భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. కంపెనీ ఇండియాలో 10000వ ప్యాసింజర్ కారును డెలివరీ చేసినట్లు ఇటీవల ప్రకటించింది.
2021 చివరిలో భారతదేశంలో తన మొదటి ప్యాసింజర్ వాహనాన్ని ఈ6 ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. మొదట్లో కమర్షియల్ విభాగాన్ని దృష్టిలో ఉంచుకుని కార్లను లాంచ్ చేసిన బీవైడీ ఇండియా.. ఆ తరువాత ప్యాసింజర్ కార్లను లాంచ్ చేసింది.
BYD ప్రస్తుతం భారత మార్కెట్లో నాలుగు కార్లను (సీల్, ఆట్టొ, ఈ6, ఈమ్యాక్స్7) విక్రయిస్తోంది. రాబోయే రోజుల్లో తన లైనప్‌ను పెంచుకోవడంలో భాగంగా.. కంపెనీ ఆట్టొ 2 లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది క్రెటా ఈవీ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుందని సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా.. బీవైడీ 13 మిలియన్లకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. దీని వల్ల 2025 జులై 31 నాటికి 106.52 బిలియన్ కిలోగ్రాముల కార్బన్ ఉద్గారాలను ఆదా చేయడంలో కంపెనీ సహాయపడింది. ఇది దాదాపు 1.77 బిలియన్ చెట్లు గ్రహించిన CO2కు సమానం. ఈ కంపెనీ వరుసగా మూడు సంవత్సరాలుగా కాంటార్ బ్రాండ్‌జెడ్ ద్వారా టాప్ 10 అత్యంత విలువైన గ్లోబల్ ఆటోమోటివ్ బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది, 2025లో దీని బ్రాండ్ విలువ USD 14.4 బిలియన్లు, ఇది సంవత్సరానికి 43.6% వృద్ధిని సూచిస్తుంది.