
సుజుకీ మోటార్ పెట్టుబడి ప్రణాళికలు
దేశీ కార్యకలాపాల పటిష్టతకు దన్ను
కంపెనీ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ
మారుతీ తొలి ఎలక్ట్రిక్ కారు ఈ–విటారా ఎగుమతులు ప్రారంభం
హన్సల్‌పూర్, గుజరాత్: ఆటో రంగ జపనీస్ దిగ్గజం సుజుకీ మోటార్ కార్పొరేషన్ భారత్‌లో రానున్న 5–6ఏళ్లలో రూ. 70,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా దేశీయంగా కార్యకలాపాలను మరింత పటిష్ట పరచుకోనున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ పేర్కొన్నారు. దేశీ అనుబంధ సంస్థ మారుతీ సుజుకీ తొలిసారిగా రూపొందించిన ఎలక్ట్రిక్ కారు ఈ–విటారా ఎగుమతులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అంతేకాకుండా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహన తయారీలో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్ ఉత్పత్తికి సైతం ప్రధాని తెరతీశారు.
రానున్న 5–6 ఏళ్లలో దేశీయంగా రూ. 70,000 కోట్ల పెట్టుబడులను చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొషిహిరో వెల్లడించారు. భారత్ మొబిలిటీ ప్రయాణంలో నాలుగు దశాబ్దాలుగా భాగస్వామి అయినందుకు గర్వపడుతున్నట్లు చెప్పారు. గ్రీన్ మొబిలిటీ, వికసిత భారత్ లక్ష్యాల సాధనలో మద్దతివ్వడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. వార్షికంగా 40 లక్షల యూనిట్ల తయారీ లక్ష్యాన్ని అందుకునేందుకు తాజా పెట్టుబడులను వినియోగించనున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్‌సీ భార్గవ తెలిపారు. ఇందుకు మద్దతుగా మౌలికసదుపాయాలు, ఆర్‌అండ్‌డీ, కొత్త టెక్నాలజీలపై పెట్టుబడులను వెచ్చించనున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి: సుంకాల ప్రభావం.. ఎదురయ్యే సవాళ్లు: ఆర్‌బీఐ గవర్నర్
జీఎస్‌టీ సమావేశం తర్వాత..
వచ్చే నెలలో నిర్వహించనున్న జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం తదుపరి గుజరాత్‌లో రెండో ప్లాంటు ఏర్పాటుపై స్పష్టత రాగలదని భార్గవ పేర్కొన్నారు. రూ. 35,000 కోట్ల పెట్టుబడితో రెండో ప్లాంటును నెలకొల్పనున్నట్లు గతేడాది ప్రకటించిన నేపథ్యంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబుగా భార్గవ జీఎస్‌టీ నిర్ణయాల కోసం వేచిచూస్తున్నట్లు తెలియజేశారు. ఎగుమతులకు ఉద్ధేశించిన ఈ–విటారా కార్లను 100 దేశాలకు సరఫరా చేయనున్నట్లు భార్గవ వెల్లడించారు. అయితే దేశీయంగా ఎప్పుడు విడుదల చేసేదీ వెల్లడించలేదు. బ్యాటరీలను దిగుమతి చేసుకుంటుండటంతో కార్ల తయారీ ధర అధికంగా ఉందన్నారు. కాగా.. సుజుకీ గ్రూప్ ఇప్పటికే భారత్‌లో రూ. లక్ష కోట్లను ఇన్వెస్ట్ చేసినట్లు మారుతీ సుజుకీ పేర్కొంది. వీటి ద్వారా ప్రత్యక్షంగా 11 లక్షలకుపైగా ఉద్యోగాల కల్పన జరిగినట్లు తెలియజేసింది.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi flags off the 'e-VITARA', Suzuki’s first global strategic Battery Electric Vehicle (BEV), at the Suzuki Motor plant in Hansalpur, Ahmedabad.
(Source: DD News) pic.twitter.com/CLKE9nvnKG— ANI (@ANI) August 26, 2025