
ముంబై: టారిఫ్ పరమైన అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఆర్థిక సవాళ్లను విసురుతున్నట్టు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ఈ తరుణంలో పెట్టుబడులను ఇతోధికం చేసేందుకు బ్యాంక్‌లు, కార్పొరేట్లు కలసి రావాలని పిలుపునిచ్చారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు.
అమెరికా - భారత్ వాణిజ్య ప్రతినిధుల మధ్య కొనసాగుతున్న సంప్రదింపులు అంతిమంగా ఒక నిర్ణయానికి దారితీస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు టారిఫ్‌ల కారణంగా దేశీ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం పరిమితం అవుతుందన్నారు. భారత ఉత్పత్తులపై అమెరికా 25 శాతం టారిఫ్‌లు విధించగా, ఈ నెల 27 నుంచి మరో 25 శాతం టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో టెక్స్‌టైల్స్, రొయ్యలపై అధిక ప్రభావం పడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో అవసరమైతే రంగాల వారీ ఆర్థిక చేయూతకు అవకాశం ఉంటుందని మల్హోత్రా సంకేతం ఇచ్చారు.
పరపతి విధానంలో భాంగా ద్రవ్యోల్బణంతోపాటు వృద్ధి క్రమాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పారు. ‘‘క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. భౌగోళిక రాజకీయ, టారిఫ్ పరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. కనుక ఆర్థిక విస్తరణ మార్గాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. బ్యాంక్‌లు, కార్పొరేట్ బ్యాలన్స్ షీట్లు మెరుగ్గా ఉన్నాయి. కనుక అవి పరస్పర సహకారంతో పెట్టుబడుల సైకిల్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లాలి. ఈ కీలక తరుణంలో ఇది ఎంతో అవసరం’’అని పేర్కొన్నారు.
రుణ వృద్ధికి చర్యలు..
ధరల స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం వృద్ధికి అడ్డుకావని మల్హోత్రా అభిప్రాయపడ్డారు. బ్యాంకుల రుణ వృద్ధి మూడేళ్ల కనిష్టానికి తగ్గిన తరుణంలో.. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఆర్‌బీఐ నియత్రణలోని సంస్థల వ్యాపార సులభతర నిర్వహణను పెంచడంపైనా దృష్టి పెట్టినట్టు చెబుతూ, దీనివల్ల వ్యయాలు తగ్గుతాయన్నారు. ఆర్‌బీఐ ఎన్నో వివరాలు కోరుతుందన్న అభిప్రాయాలు నెలకొన్నాయని చెబుతూ.. అడిగిన సమాచారం విషయంలో భాగస్వాములు సహకరించాలని కోరారు. దీనివల్ల మెరుగైన నియంత్రణలకు అవకాశం ఉంటుందన్నారు. త్వరలోనే బాసెల్-3 నిబంధనలను అమల్లోకి తెస్తామని చెప్పారు. అందరికీ ఆర్థిక సేవలను మరింత విస్తృతం చేయడం, చిన్న వ్యాపారులకూ రుణ సాయం చేరువ చేయడం, కస్టమర్ సేవల నాణ్యతను పెంచడం తమ ప్రాధాన్యతలుగా చెప్పారు.