
భారత ఆటోమొబైల్ తయారీలో మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ తన కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్ ఎగుమతుల్లో రికార్డు నెలకొల్పింది. భారతదేశం నుంచి వేగంగా 1 లక్ష ఎగుమతులను అధిగమించిన ఎస్‌యూవీగా నిలిచిందని కంపెనీ ప్రకటించింది. 2023 జూన్‌లో ప్రపంచ ఎగుమతి కార్యకలాపాలు ప్రారంభమైన కేవలం 25 నెలల్లోనే ఈ మైలురాయిని చేరుకుందని చెప్పింది.
గుజరాత్‌లోని మారుతీ సుజుకీ ప్లాంట్‌లో ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్రాంక్స్ లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాతో సహా విదేశీ మార్కెట్లలో బలమైన పనితీరును కనబరుస్తోందని కంపెనీ తెలిపింది. జపాన్‌లో దీనికి పెరుగుతున్న ప్రజాదరణ ఎగుమతి వృద్ధికి దోహదం చేసిందని చెప్పింది. మారుకీ సుజుకీ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టేకుచి మాట్లాడుతూ.. ‘ప్రపంచ మార్కెట్ల కోసం ప్రపంచ స్థాయి వాహనాలను తయారు చేయగల సామర్థ్యం కంపెనీకి ఉంది. మేక్ ఇన్ ఇండియా చొరవకు కంపెనీ సాధించిన విజయమే నిదర్శనం. ప్యాసింజర్ వాహన ఎగుమతులు, అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టి సారిస్తున్నాం’ అని చెప్పారు.
ఇదీ చదవండి: ఇండియా-యూకే ట్రేడ్ డీల్ వ్యవసాయానికి జాక్‌పాట్
2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే మారుతీ సుజుకీ 96,000 వాహనాలను ఎగుమతి చేయడం విశేషం. భారతదేశ ప్యాసింజర్ వాహన ఎగుమతుల్లో రికార్డు స్థాయిలో 47 శాతం వాటాను ఆక్రమించింది. వరుసగా నాలుగో ఏడాది భారతదేశపు టాప్ ప్యాసింజర్ వాహన ఎగుమతిదారుగా కంపెనీ తన స్థానాన్ని నిలుపుకుంది.