
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ జాక్‌పాట్ కొట్టారు. అమాంతం ఎగిసిన షేర్లను అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ వారం ఆయన 2,01,404 కంపెనీ షేర్లను విక్రయించారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) వద్ద ఫారం 4 ఫైలింగ్ ప్రకారం.. ఈ ఏడాది మార్చిలో తాను అనుసరించిన ముందస్తు ‘10 బి 5-1’ ట్రేడింగ్ ప్లాన్ కింద ఆగస్టు 11, 12, 13 తేదీలలో లావాదేవీలు జరిగాయి.
ఈ షేర్లను 180.026 డాలర్ల నుంచి 183.6417 డాలర్ల వరకు విక్రయించి మొత్తం 40,959,534 డాలర్ల (సుమారు రూ.334 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించారు. ఇన్వెస్టింగ్.కామ్ (Investing.com) నివేదిక ప్రకారం.. ఎన్విడియా స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి 184.48 డాలర్లకు దగ్గరగా ట్రేడ్ కావడంతో ఈ లావాదేవీలు జరిగాయి. ఎన్విడియా గత 12 నెలల్లో 86% ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. ఈ లావాదేవీల తర్వాత హువాంగ్ కు కంపెనీలో ఇంకా 72,998,225 షేర్లు ఉన్నాయి.
ఏమిటీ 10బి5-1 ట్రేడింగ్ ప్లాన్?
రూల్ 10బి5-1 అనేది యూఎస్ ఎస్ఈసీ నుండి వచ్చిన నిబంధన. ఇది పబ్లిక్ లిస్టెడ్ సంస్థలలోని ఇన్సైడర్లు తమ వాటాలను ముందుగానే విక్రయించే ప్రణాళికను ఏర్పాటు చేయడానికి అనుమతిస్తుంది. ఈ నియమం ప్రకారం, ప్రధాన వాటాదారులు నిర్ణీత సమయంలో నిర్ణీత సంఖ్యలో షేర్ల అమ్మకాన్ని షెడ్యూల్ చేయవచ్చు. తద్వారా ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలకు ఆస్కారం ఉండదు. చాలా మంది కంపెనీ ఎగ్జిక్యూటివ్ లు ఈ కారణంగా 10b5-1 ప్లాన్ లను ఉపయోగిస్తారు.