జీల్‌లో ఇన్వెస్కో వాటా విక్రయం!

Invesco To Sell 7.8% Stake In Zee Entertainment - Sakshi

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌(జీల్‌)లో ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ ఇన్వెస్కో 7.74 శాతం వాటాను విక్రయించింది. ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీ ద్వారా షేరుకి రూ.281.46 ధరలో 7,43,18,476 షేర్లను ఇన్వెస్కో ఓపెన్‌హీమర్‌ డెవలపింగ్‌ మార్కెట్స్‌ ఫండ్‌ అమ్మివేసింది. వీటి విలువ దాదాపు రూ. 2,092 కోట్లుకాగా.. కోటికిపైగా షేర్లను మోర్గాన్‌ స్టాన్లీ ఏషియా సింగపూర్‌ కొనుగోలు చేసింది. 

బీఎస్‌ఈ బల్క్‌డీల్‌ గణాంకాల ప్రకారం సేగంటి ఇండియా మారిషస్‌ 99 లక్షల షేర్లను సొంతం చేసుకుంది. 7.8 శాతం వరకూ జీల్‌ వాటాను విక్రయించనున్నట్లు బుధవారమే ఇన్వెస్కో ప్రకటించింది. డెవలపింగ్‌ మార్కెట్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ టీమ్‌ నిర్వహిస్తున్న ఇతర ఫండ్స్‌కు తగిన విధంగా ఈ విక్రయాన్ని చేపడుతున్నట్లు పేర్కొంది.  

వాటాదారులకు విలువ
జీల్‌లో ఇన్వెస్కో అతిపెద్ద వాటాదారుకాగా.. ఈ అమ్మకం తదుపరి మూడు ఫండ్స్‌ను నిర్వహిస్తున్న ఇన్వెస్ట్‌మెంట్‌ టీమ్‌ కంపెనీలో కనీసం 11 శాతం వాటాతో నిలవనుంది. జీ– సోనీ విలీనానికి మద్దతివ్వనున్నట్లు ఇన్వెస్కో గత నెలలోనే ప్రకటించింది. తద్వారా గతంలో చేసిన డిమాండ్లనుంచి వెనక్కి తగ్గుతున్నట్లు తెలియజేసింది. ఎండీ, సీఈవో పునీత్‌ గోయెంకాతోపాటు మరో ఇద్దరు స్వతంత్ర సభ్యులను బోర్డు నుంచి తొలగించాలని, ఇందుకు అత్యవసర వాటాదారుల సమావేశాన్ని(ఈజీఎం) నిర్వహించాలని ఇన్వెస్కో పట్టుపట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జీ– సోనీ విలీనంతో జీ వాటాదారులకు ఉత్తమ విలువ చేకూరనున్నట్లు అభిప్రాయపడటం గమనార్హం! ఇన్వెస్కో వాటా విక్రయ వార్తల నేపథ్యంలో జీల్‌ షేరు బీఎస్‌ఈలో 2 శాతం క్షీణించి రూ. 285 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top