
భారతదేశ ఉద్యోగ పరిశ్రమలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న రంగాల్లో సేవలందిస్తున్న సంస్థలు ఇంటర్న్‌లకు భారీ స్టైపెండ్‌లు ఆఫర్ చేస్తున్నాయి. ఆమ్‌స్ట్రడమ్ ఆధారిత ఐఎంసీ ట్రేడింగ్ బీవీ తన ఇంటర్న్‌లకు నెలకు రూ.12.5 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు తెలిపింది. ఇది 2024లో కంపెనీ చెల్లించిన స్టైపెండ్‌ల కంటే మూడు రెట్లు అధికంగా ఉండడం గమనార్హం. క్వాడే కంపెనీ తన ఇంటర్న్‌ల స్టెపెండ్‌ను నెలకు రూ.7.5 లక్షలకు పెంచింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 50% పెరుగుదలను సూచిస్తుంది.
ప్రతిభ కలిగిన వారికి కంపెనీలు ఎంతైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ వ్యవహారం ద్వారా తెలుస్తుంది. ఇటీవల కాలంలో మెటా ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఏర్పాటుకు ప్రపంచంలోని టెక్ నిపుణుల కోసం కంపెనీ సెర్చింగ్ ప్రారంభించింది. అందుకు దాదాపు రూ.880 కోట్ల వరకు కూడా ప్రవేశ ప్యాకేజీని అందించేందుకు సిద్ధపడింది. ప్రస్తుతం మెరుగైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులకు ఐఎంసీ ట్రేడింగ్ బీవీ, క్వాడే కంపెనీలు ఇంటర్న్‌లకు భారీగా స్టైపెండ్ ఇచ్చేందుకు సన్నద్ధం అయ్యాయి. వీటి బాటలోనే మరిన్ని కంపెనీలు నడిచే అవకాశం ఉంది. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కంపెనీకి వ్యాల్యూ యాడ్ చేసే వారికి ఎప్పటికీ జాబ్ మార్కెట్‌లో గిరాకీ ఉంటుందని దీని ద్వారా తెలుస్తుంది.
ముఖ్యంగా క్వాంట్ పరిశోధకులు, ట్రేడింగ్ ఇంజినీర్లు, గణితం, కంప్యూటర్ సైన్స్, డేటా మోడలింగ్‌లో మెరుగైన నైపుణ్యాలు ఉన్న అల్గోరిథమిక్ డెవలపర్లకు, ఏఐ ప్రాంప్టింగ్ ఇంజినీరింగ్, జెన్‌ఏఐ ట్రెయినింగ్ ఉద్యోగాలకు డిమాండ్ ఉన్నట్లు కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐఎంసీ ట్రేడింగ్ బీవీ, క్వాడే కంపెనీల ఇంటర్న్‌షిప్‌లో చాలా మంది ఐఐటీ, బిట్స్ పిలానీ, ఎంఐటీ, ఈటీహెచ్ జ్యూరిచ్ వంటి గ్లోబల్ విశ్వవిద్యాలయాల నుంచి హాజరయ్యారు.
ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!