
వేతన సవరణ భారం మోయలేమని తేల్చేసిన ఆర్టీసీ
15 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చినా నెలకు రూ.60 కోట్ల భారం
మహాలక్ష్మి రీయింబర్స్‌మెంట్‌ను ఆ మేరకు పెంచాలని ప్రతిపాదన
2021 వేతన సవరణకు కసరత్తు.. ప్రభుత్వానికి నివేదన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) తన ఉద్యోగుల వేతన సవరణ బాధ్యతను ప్రభుత్వానికి వదిలేసింది. ప్రభుత్వం ఆర్థిక చేయూతనందిస్తేనే ఉద్యోగుల జీతాలు పెంచే అవకాశం ఉంటుందని తేల్చి చెప్పింది. 2017 నాటి వేతన సవరణను గతేడాది ఏప్రిల్‌లో అమలు చేసిన నేపథ్యంలో, ఆ తదుపరి 2021 వేతన సవరణపై సంస్థ దృష్టి సారించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో 2025 వేతన సవరణ గడువు ప్రారంభమవుతున్నందున, 2021 వేతన సవరణ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తిరిగి పోలీసు శాఖకు బదిలీ అయ్యే అవకాశం ఉన్నందున, ఈలోపు దీన్ని కొలిక్కి తేవాలని ఆయన ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అక్కడి నుంచి ఆమోదం లభిస్తే నాలుగేళ్ల జాప్యంతో ఆ వేతన సవరణను పూర్తి చేసినట్టవుతుంది.
15 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే నెలకు రూ.60 కోట్ల భారం
వేతన సవరణ చేస్తే సంస్థపై పడే భారంపై అధికారులు లెక్కలు వేశారు. హీనపక్షంగా 10 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చినా నెలకు జీతాల భారం అదనంగా రూ.40 కోట్లు పెరుగుతుంది. అదే 15 శాతం ప్రకటిస్తే ఆ మొత్తం రూ.60 కోట్లకు చేరుకుంది. మహాలక్ష్మి పథకం వల్ల రోజువారీ ఆదాయం తగ్గటంతో సంస్థ సొంతంగా ఈ భారాన్ని మోయటం అసాధ్యం. ప్రస్తుతం టికెట్ రూపంలో ఆర్టీసీకి వస్తున్న ఆదాయం రోజుకు రూ.12 కోట్ల లోపే. రోజువారీ ఖర్చులకు కూడా ఆ నిధులు సరిపోవటం లేదు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చాక, మహిళా ప్రయాణికుల నుంచి ఆదాయం 90 శాతం తగ్గిపోయింది. వేతన సవరణ చేస్తే రోజుకు అదనంగా రూ.2 కోట్లు చొప్పున జీతాలకు అదనంగా చెల్లించాలి. దానిని సర్దుబాటు చేయటం ఇప్పుడున్న పరిస్థితుల్లో సంస్థకు అసాధ్యమని ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి తేల్చి చెప్పింది.
రీయింబర్స్‌మెంట్‌ను రూ.350 కోట్లకు పెంచాలి..
మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఆర్టీసీకి నెలకు రూ.310 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం కూడా ప్రతినెలా విడుదల కావటం లేదు. గత నెల రూ.190 కోట్లు మాత్రమే విడుదల కావటంతో ఉద్యోగులకు సకాలంలో ఆర్టీసీ జీతాలు చెల్లించలేకపోయింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని కనీసం రూ.350 కోట్లకు పెంచితే దానికి సరిపడే ఫిట్‌మెంట్ మేరకు వేతన సవరణ చేస్తామని తాజాగా ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదించింది.
2017 విడత వేతన సవరణను అప్పట్లో సకాలంలో చేయలేదు. దీంతో కార్మికులు సమ్మె చేయగా, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఐదుగురు మంత్రులతో కమిటీ వేసింది. ఆ కమిటీ కార్మిక సంఘాల నేతలతో చర్చించి, ఆర్థిక పరిస్థితి బాగోలేనందున కొంత విరామం తర్వాత వేతన సవరణ చేస్తామని, అప్పటి వరకు మధ్యంతర భృతి ఇస్తామని తేల్చి చెప్పింది. ఆ మేరకు 16 శాతం మధ్యంతర భృతిని ఖరారు చేసింది.
2024 వరకు అదే కొనసాగింది. మళ్లీ కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధం కావటంతో, గత సంవత్సరం ప్రభుత్వం 21 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఇప్పుడు అంతమేర ఫిట్‌మెంట్ ఇచ్చే పరిస్థితి దాదాపు లేదని ఆర్టీసీ పరోక్షంగా స్పష్టం చేసింది. 15 శాతం ఖరారు చేసినా పరిస్థితి చేయిదాటిపోతుందని తేల్చింది. ప్రభుత్వం ఎంతమేర ఆర్థిక సాయం చేస్తే అంతమేర వేతనాలను పెంచేందుకు సిద్ధమవుతోంది.