
హిందుస్తాన్ కాపర్, ఆయిల్ ఇండియా జట్టు
చైనా దిగుమతులను తగ్గించడమే లక్ష్యం
న్యూఢిల్లీ: రాగి సహా కీలక ఖనిజాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేలా, దేశీయంగానే మరింతగా ఉత్పత్తి చేయడంపై ప్రభుత్వ రంగ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా హిందుస్తాన్ కాపర్ (హెచ్‌సీఎల్), ఆయిల్ ఇండియా (ఆయిల్) అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దేశీయంగా కీలక ఖనిజాల వెలికితీత, ఉత్పత్తికి ఇది ఉపయోగపడనుంది.
క్రూడాయిల్ వెలికితీత, ఉత్పత్తి, రవాణాలో ఆయిల్ ఇండియాకు అపార అనుభవం ఉంది. అటు గనుల శాఖలో భాగమైన హెచ్‌సీఎల్‌కి కాపర్ తదితర ఉత్పత్తుల మైనింగ్, ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌లో అనుభవం ఉంది. రాగికి సంబంధించి దేశీయంగా మైనింగ్ లీజులన్నీ కంపెనీకే ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, గెయిల్ ఇండియా రైట్స్‌లాంటి ప్రభుత్వ రంగ సంస్థల తరహాలోనే క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్ బ్లాక్‌ల కోసం బిడ్డింగ్ చేయనున్నట్లు హిందుస్తాన్ కాపర్ ఇప్పటికే ప్రకటించింది.
దేశీ, విదేశీ మార్కెట్లలో కీలక ఖనిజాలను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు కంపెనీతో, ఇంజనీరింగ్ సంస్థ రైట్స్ ఒప్పందం కుదుర్చుకుంది. పర్యావరణహితమైన ఇంధనాల విషయంలో స్వావలంబన సాధించే దిశగా కేంద్రం ప్రాథమికంగా రూ. 16,300 కోట్లతో జాతీయ క్రిటికల్ మినరల్ మిషన్‌ను ప్రకటించింది. ఏడేళ్లలో దీనిపై మొత్తం రూ. 34,300 కోట్లు వెచి్చంచనుంది. రాగి, లిథియం, నికెల్, కోబాల్ట్, రేర్ ఎర్త్ మినరల్స్‌లాంటివి, స్వచ్ఛ ఇంధన టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు కీలకమైన ముడి వనరులుగా ఉపయోగపడతాయి.