రైలు ప్రయాణికులకు శుభవార్త! మళ్లీ ప్యాసింజర్ రైళ్లు..

Indian Railways Reduce Passenger Train Fare - Sakshi

Passenger Train Fare : సామాన్య రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది.  'ఎక్స్‌ప్రెస్ స్పెషల్స్' లేదా 'మెము/డెము ఎక్స్‌ప్రెస్' రైళ్లుగా పేరు మార్చిన 'ప్యాసింజర్ రైళ్ల'కి సెకండ్ క్లాస్ ఆర్డినరీ ఛార్జీలను పునరుద్ధరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 

కోవిడ్‌ మహమ్మారి లాక్‌డౌన్ తర్వాత రైల్వేలు వాటి పేర్లను మార్చడం ద్వారా 'ప్యాసింజర్ రైళ్ల'ను క్రమంగా నిలిపివేసింది. 'ఆర్డినరీ క్లాస్' ఛార్జీలను తీసేసి ఎక్స్‌ప్రెస్ రైలు ఛార్జీలతో సమానంగా కనీస టిక్కెట్ ధరను రూ.10 నుంచి రూ.30కి పెంచిన విషయం తెలిసిందే.

ఫిబ్రవరి 27 నుంచే అమల్లోకి..
ది హిందూ కథనం ప్రకారం.. సెకండ్ క్లాస్ ఆర్డినరీ రైళ్లలో కనీస ఛార్జీల పునరుద్ధరణ మంగళవారం (ఫిబ్రవరి 27) తెల్లవారుజాము నుంచే అమల్లోకి వచ్చింది. ఈ మేరకు చీఫ్ బుకింగ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్‌లకు రైల్వే శాఖ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్యాసింజర్ రైళ్లను రీ-కేటగిరీ చేసి ఎక్స్‌ప్రెస్ రైలు ఛార్జీలను వసూలు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శనాత్మక కథనాలు రావడంతో రైల్వే బోర్డు సమీక్షా సమావేశాన్ని నిర్వహించి మునుపటి ఆర్డినరీ చార్జీలను పునరుద్ధరించాలని అన్ని జోనల్ రైల్వేలకు ఆదేశాలు జారీ చేసింది.

జనరల్ మేనేజర్ల సూచనల మేరకు జోనల్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లు 'ఆర్డినరీ క్లాస్' ఛార్జీలను సర్దుబాటు చేసేందుకు సిస్టమ్‌లో మార్పులు చేశారు. అన్ని మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లు (MEMU), జీరో నంబర్‌తో మొదలయ్యే అన్ని రైళ్లలో ఆర్డినరీ క్లాస్‌లో దాదాపు 50 శాతం ఛార్జీలను రైల్వే శాఖ తగ్గించింది. ఈ మేరకు అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్ (UTS) యాప్‌లో కూడా ఛార్జీలు సవరించారు. ఈ ఛార్జీ తగ్గింపు గతంలో ప్యాసింజర్ రైళ్లుగా ఉండి ఇప్పుడు 'ఎక్స్‌ప్రెస్ స్పెషల్' లేదా మెముగా నడుస్తున్న అన్ని రైళ్లకు వర్తిస్తుంది.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top