రష్యా చమురు రేసులో దేశీ సంస్థలు

Indian Oil Companies Showing Interest To Buy Russia Crude Oil - Sakshi

ఐవోసీ బాటలో హెచ్‌పీసీఎల్‌   2 మిలియన్‌ బ్యారెళ్ల కొనుగోలు   1 మిలియన్‌ బ్యారెళ్ల కోసం ఎంఆర్‌పీఎల్‌ ఆర్డరు   

న్యూఢిల్లీ: భారీ డిస్కౌంటుతో లభిస్తున్న రష్యా ముడి చమురును కొనుగోలు చేసేందుకు దేశీ రిఫైనరీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మూడు మిలియన్‌ బ్యారెళ్లు కొనుగోలు చేసిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) బాటలోనే తాజాగా హిందూస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) రెండు మిలియన్‌ బ్యారెళ్లు తీసుకుంది. యూరప్‌కు చెందిన ట్రేడరు విటోల్‌ ద్వారా రష్యన్‌ ఉరల్స్‌ క్రూడాయిల్‌ను హెచ్‌పీసీఎల్‌ కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మంగళూరు కూడా
మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ (ఎంఆర్‌పీఎల్‌) కూడా అదే తరహాలో ఒక మిలియన్‌ బ్యారెళ్ల క్రూడాయిల్‌ కోసం టెండర్లు ఆహ్వానించింది. ఉక్రెయిన్‌ మీద దాడుల కారణం గా రష్యాపై పాశ్చాత్య దేశాలు భారీగా ఆంక్షలు విధించడంతో ఆ దేశం ఉత్పత్తి చేసే ముడి చమురు భారీ డిస్కౌంటుకు లభిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, చమురును చౌకగా దక్కించుకునేందుకు భారత రిఫైనింగ్‌ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మే నెలలో డెలివరీ కోసం బ్యారెల్‌కు 20–25 డాలర్ల డిస్కౌంటుతో ఐవోసీ గత వారమే మూడు మిలియన్‌ బ్యారెళ్లను విటోల్‌ సంస్థ ద్వారా కొనుగోలు చేసింది. అమెరికాలో భారీగా కార్యకలాపాలు ఉన్నందున, రష్యాపై ఆంక్షల ప్రభావం తమపై కూడా పడే అవకాశం ఉండటంతో ప్రైవేట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మాత్రం రష్యన్‌ క్రూడాయిల్‌కు దూరం గా ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.  

డాలర్లలో సెటిల్మెంట్‌.. 
అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థాపరంగా ఇంకా ఆంక్షలేమీ విధించనందున.. రష్యాతో వాణిజ్య లావాదేవీలకు భారత రిఫైనర్లు డాలర్ల మారకంలోనే సెటిల్మెంట్‌ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వివాదాస్పద అణ్వాయుధాల తయారీ కారణంగా ఇరాన్‌పై విధించినట్లుగా రష్యా చమురుపై నిషేధం ఏదీ ప్రస్తుతం లేదు. ఫలితంగా ఏ దేశమైనా లేదా కంపెనీ అయినా రష్యా చమురు లేదా ఇతర ఇంధన కమోడిటీలను కొనుగోలు చే సేందుకు, అంతర్జాతీయ పేమెంట్‌ సిస్టమ్స్‌ ద్వారా చెల్లింపులు జరిపేందుకు వెసులుబాటు ఉంటోంది.  

2020 నుంచే ఒప్పందాలు.. 
దేశీయంగా క్రూడాయిల్‌ ఉత్పత్తి అంతంత మాత్రమే కావడంతో.. భారత్‌ తన అవసరాలకు సంబంధించి 85% క్రూడ్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ఎక్కువ వాటా మధ్యప్రాచ్య దేశాలదే. అయితే వాటిపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో రష్యా, అమెరికా తదితర దేశాల నుంచి కూడా భారత్‌ సరఫరా పెంచుకుంటోంది. సౌదీ అరేబియా తర్వాత ప్రపంచంలో చమురు ఎగుమతులపరంగా రష్యా రెండో స్థానంలో ఉంది. యూరప్‌లోని పలు దేశాలు తమ ఇంధన అవసరాల కోసం రష్యాపైనే ఆధారపడుతున్నాయి. కానీ, రష్యా నుండి భారత్‌ కొనుగోలు చేస్తున్నది చాలా తక్కువే. 2021లో కేవలం 45,000 బ్యారెళ్లు మాత్రమే దిగుమతి చేసుకుంది. రవాణా రేట్లు భారీగా ఉండటమే ఇందుకు కారణం. వాస్తవానికి.. దాదాపు 2 మిలియన్‌ టన్నుల ముడిచమురును కొనుగోలు చేసేందుకు రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్‌ ఆయిల్‌ కంపెనీతో 2020 ఫిబ్రవరిలోనే ఐవోసీ ఒప్పందం కుదుర్చుకుంది.

చదవండి: భారత్‌లో పెట్టుబడులకు ఇదే మంచి సమయం, క్యూ కడుతున్న సరిహద్దు దేశాలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top