పెరిగిన భారత్‌ బంగారం నిల్వల విలువ | India Gold Reserves Value Rise Overall Forex Reserves Down | Sakshi
Sakshi News home page

పెరిగిన భారత్‌ బంగారం నిల్వల విలువ

Jun 12 2026 7:05 PM | Updated on Jun 12 2026 8:54 PM

India Gold Reserves Value Rise Overall Forex Reserves Down

భారత విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో (Forex Reserves) స్వల్ప తగ్గుదల నమోదైనప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద ఉన్న బంగారం నిల్వల విలువ గణనీయంగా పెరిగింది. ఆర్‌బీఐ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, జూన్ 5తో ముగిసిన వారంలో దేశ బంగారం నిల్వల విలువ 1.98 బిలియన్ డాలర్లు పెరిగి 114.58 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

అదే సమయంలో మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వలు 711 మిలియన్ డాలర్లు తగ్గి 681.61 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఫారెక్స్‌ రిజర్వుల్లో అతిపెద్ద వాటా కలిగిన విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign Currency Assets - FCA) 2.70 బిలియన్ డాలర్లు తగ్గి 543.44 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

ఎఫ్‌సీఏలను అమెరికా డాలర్‌ విలువలో లెక్కిస్తారు. అయితే ఈ నిల్వల్లో యూరో, పౌండ్ స్టెర్లింగ్‌, జపాన్‌ యెన్‌ వంటి ఇతర ప్రధాన కరెన్సీలు కూడా ఉండటంతో, వాటి మారకపు విలువల్లో చోటుచేసుకునే మార్పులు ఎఫ్‌సీఏపై ప్రభావం చూపుతాయి.

గత వారంలో భారత విదేశీ మారక నిల్వలు సుమారు 938 మిలియన్ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే. రూపాయి మారకపు విలువలో అధిక ఒడిదుడుకులు కనిపించినప్పుడు లేదా మార్కెట్లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఆర్‌బీఐ ఫారెక్స్‌ మార్కెట్లో జోక్యం చేసుకుంటూ నిల్వలను వినియోగిస్తుంది.

ఇటీవల అమెరికా డాలర్‌ నిల్వలను బలోపేతం చేయడం, రూపాయి స్థిరత్వానికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా ఎఫ్‌సీఎన్‌ఆర్‌-బీ (FCNR-B) డిపాజిట్ల హెడ్జింగ్‌ ఖర్చును భరించనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.

ప్రస్తుతం భారత రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే 95 స్థాయి వద్ద ట్రేడవుతోంది. ఇది ఈ ఏడాది ప్రారంభంలో నమోదైన 97 స్థాయితో పోలిస్తే మెరుగైన స్థితిగా భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో రూపాయి మారకం విలువ 94.70 నుంచి 95.60 మధ్య కదలాడే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదీ చదవండి: టాటా కారు కొనుగోలుదారులకు షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement