
2025–26 ఆఖరు నాటికి అంచనాలు
పరిశ్రమ నిపుణుల వెల్లడి
న్యూఢిల్లీ: దేశీయంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగం 2025–26 ఆఖరు నాటికి 535 బిలియన్ డాలర్లకు చేరనుంది. వినియోగం, ఎగుమతులు పెరుగుతుండటం, మేకిన్ ఇండియాపై ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతుండటంలాంటి అంశాలు ఇందుకు దోహదపడనున్నట్లు పరిశ్రమ నిపుణులు తెలిపారు.
ఏఐ ఆటోమేషన్, స్మార్ట్ ప్యాకేజింగ్‌లో సరికొత్త మార్పులు వస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆహారం, ప్యాకేజింగ్ మెటీరియల్స్ హబ్‌గా భారత్ ఎదిగే అవకాశం ఉందని ఫై ఇండియా, ప్రోప్యాక్ ఇండియా పేరిట ఇన్ఫోర్మా మార్కెట్స్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నిపుణులు చెప్పారు.
ప్రస్తుతం 1.9 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ సేంద్రియ ఆహార మార్కెట్ ఏటా 20.13 శాతం వృద్ధి రేటుతో 2033 నాటికి 10.8 బిలియన్ డాలర్లకు చేరగలదని వివరించారు. ఆహార రంగానికి వెన్నెముకగా ఉంటున్న ఆహార పదార్థాల మార్కెట్ ఏటా 7–8 శాతం పెరుగుతోందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్, ఇండ్రస్టియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) చీఫ్ సైంటిస్ట్ మీనాక్షి సింగ్ తెలిపారు. ఆహార భద్రత, నాణ్యతను పరిరక్షించడంలో ప్యాకేజింగ్ పరిశ్రమ కూడా కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు.
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ)లాంటి స్కీముల దన్నుతో పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. లేబులింగ్, సేంద్రియ ఆహార ప్రమాణాలు, వినియోగదారుల్లో అవగాహన పెంచడంలాంటి అంశాలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కఠినంగా దృష్టి పెడుతుండటంతో పరిశ్రమ పాటించే విధానాల్లోనూ మార్పులు వస్తున్నాయని చాంబర్ ఆఫ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ స్మాల్, మీడియం బిజినెసెస్ ప్రెసిడెంట్ నీలేష్ లెలె తెలిపారు.
ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలపై ఆసక్తి..
భారతీయుల ఆహార అలవాట్లు (బాస్మతి బియ్యం లేదా ప్రాంతాలను బట్టి పచ్చళ్లులాంటివి), ప్రవాస భారతీయుల వినియోగ ధోరణుల్లోను మార్పులకు దారి తీయడం కొనసాగుతోంది. ఆరోగ్యంపై అవగాహన, సేంద్రియ.. మొక్కల ఆధారిత ఆహారానికి ప్రాధాన్యత పెరుగుతున్నందున భారతీయ ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ప్రస్తుతం పరివర్తనాత్మక దశలో ఉన్నట్లు ఇన్ఫోర్మా మార్కెట్స్ ఇన్ ఇండియా ఎండీ యోగేష్ ముద్రాస్ తెలిపారు.
వినియోగదారులు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలకు కాస్త ఎక్కువ వెచి్చంచేందుకు సిద్ధంగా ఉంటున్నారని వివరించారు. దీనితో పండ్లు, కూరగాయలు, మొక్కల ఆధారిత ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని యోగేష్ చెప్పారు. ‘సేంద్రియ ఆహార పరిశ్రమ ప్రస్తుతం 2 బిలియన్ డాలర్లుగా ఉండగా ఏటా 22 శాతం వృద్ధి చెందుతూ, 2033 నాటికి 10 బిలియన్ డాలర్లకు ఎగియనుంది.
ఫుడ్ మార్కెట్లో ప్రస్తుతం సేంద్రియ ఆహారోత్పత్తుల వాటా స్వల్పస్థాయిలోనే ఉన్నప్పటికీ, ఆరోగ్యకరమైన, పర్యావరణహితమైన ఉత్పత్తుల కోసం 7–20 శాతం అధికంగా చెల్లించేందుకు కూడా వినియోగదారులు సిద్ధంగా ఉంటున్నారు’ అని ఎని్వరోకేర్ ల్యాబ్స్ ఎండీ నీలేష్ అమృత్‌కర్ తెలిపారు. మూడు రోజులపాటు జరిగిన ఫై ఇండియా, ప్రోప్యాక్ ఇండియా కార్యక్రమంలో 50 పైగా దేశాల నుంచి 15,000 మంది పైచిలుకు నిపుణులు పాల్గొన్నారు.