కరోనా కాలంలో ఎగుమతుల జోరు‌

India Feb Trade Deficit at 12 6 Billion Dollars as Exports Contract - Sakshi

ఫిబ్రవరిలో 0.67 శాతం వృద్ధి

వరుసగా మూడోనెలా ముందుకే

12.62 బిలియన్‌ డాలర్లకు  పెరిగిన వాణిజ్యలోటు  

న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు వరుసగా మూడవనెలా పురోగతి బాటనే నడిచాయి. 2021 ఫిబ్రవరిలో ఎగుమతులు 2020 ఇదే నెలతో పోల్చితే స్వల్పంగా 0.67 శాతం వృద్ధితో 27.93 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. ఇక దిగుమతుల విలువ కూడా ఇదే నెల్లో 6.96 శాతం పెరిగి 40.54 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. వెరసి ఎగుమతులు దిగుమతుల మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించి వాణిజ్య లోటు 12.62 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. 2020 ఫిబ్రవరిలో వాణిజ్య లోటు 10.16 బిలియన్‌ డాలర్లు. సోమవారం వెలువడిన తాజా అధికారిక గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే... 

  • చక్కటి ఎగుమతుల వృద్ధి తీరును నమోదుచేసుకున్న రంగాల్లో ఆయిల్‌ మీల్స్, ముడి ఇనుము, బియ్యం (30.78 శాతం), తివాచీలు (19.46 శాతం), సుగంధ ద్రవ్యాలు (18.61 శాతం), ఔషధాలు (14.74 శాతం), పొగాకు (7.71 శాతం), రసాయనాలు (1.2 శాతం) ఉన్నాయి.  
  • ఆయిల్‌ సీడ్స్, తోలు, పెట్రోలియం ప్రొడక్టులు, జీడిపప్పు, రత్నాలు-ఆభరణాలు, రెడీమేడ్‌ దుస్తులు, తేయాకు, ఇంజనీరింగ్‌ గూడ్స్, కాఫీ, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు మైనస్‌లో ఉన్నాయి.  

ఏప్రిల్‌-ఫిబ్రవరి మధ్య క్షీణతే..! 
ఆర్థిక సంవత్సరం 2020-21 ఏప్రిల్‌ నుంచి ఫిబ్రవరి మధ్య ఎగుమతులు 12.23 శాతం క్షీణతతో 256.18 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులు కూడా 23.11 శాతం పడిపోయి 340.80 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  

చమురు దిగుమతుల తీరిది... 
ఫిబ్రవరిలో చమురు దిగుమతులు 16.63 శాతం క్షీణించి 8.99 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్‌-ఫిబ్రవరి మధ్య ఈ దిగుమతుల పరిమాణం 40.18 శాతం పడిపోయి 72.08 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  

పసిడి భారీ పెరుగుదల.. 
వార్షికంగా 2020 ఫిబ్రవరితో పోల్చితే పసిడి దిగుమతులు భారీగా 2.36 బిలియన్‌ డాలర్ల నుంచి 5.3 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి.        

2020 మార్చి నుంచీ ఎగుమతులు ఇలా... 
కరోనా ప్రేరిత అంశాల నేపథ్యంలో 2020 మార్చి నుంచి వరుసగా ఆరు నెలలు ఆగస్టు వరకూ ఎగుమతులు క్షీణతను చూశాయి. అయితే సెప్టెంబర్‌లో వృద్ధిబాటలోకి  (5.99 శాతం వృద్ధితో 27.58 బిలియన్‌ డాలర్లు) వచ్చిన, మళ్లీ మరుసటి రెండు నెలలూ (అక్టోబర్‌-నవంబర్‌) క్షీణతలోకి జారిపోయాయి. తిరిగి 2020 డిసెంబర్‌లో స్వల్పంగా 0.14 శాతం వృద్ధి నమోదయ్యింది. వరుసగా రెండవనెలా 2021 జనవరిలోనూ వృద్ధిబాటలో పయనించాయి. 6.16 శాతం వృద్ధితో 27.45 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. ఫిబ్రవరి నెలలోనూ సానుకూల గణాంకాలే వెలువడినట్లు తాజా గణాంకాలు పేర్కొన్నాయి.

కంటైనర్ల సమస్య ప్రధానం 
ఎగుమతుల్లో స్వల్ప వృద్ధి మాత్రమే నమోదుకావడానికి కంటైనర్ల కొరతే ప్రధాన కారణం. ఫిబ్రవరి చివరి వారంలో విపరీతమైన కంటైనర్ల కొరత ఏర్పడింది. ఈ ప్రాంతంలో కంటైనర్ల కొరత ఉండడం ఇక్కడ ఒక సమస్య. చైనా నుంచి భారీ ఎగుమతుల కోసం ఖాళీ కంటైనర్లు ఆ దేశానికి పెద్ద ఎత్తున తరలి వెళుతున్నాయి. ఇలా ఖాళీ కంటైనర్లు చైనాకు తిరిగి వెళ్లడానికి షిప్పింగ్‌ లైన్స్, కంటైనర్‌ కంపెనీలకు చైనా అధిక ప్రీమియంలనూ చెల్లిస్తోంది. ఎగుమతులు ఫిబ్రవరిలో కొంత తక్కువగా ఉన్నా, అటు ఆర్డర్‌ బుక్‌ ఇటు అంతర్జాతీయంగా డిమాండ్‌ విషయంలో సానుకూల పరిస్థితి, సంకేతాలే కనిపిస్తున్నాయి. 

రానున్న రోజులు, నెలల్లో మంచి ఫలితాలే వస్తాయని ఆశిస్తున్నాం. ప్రభుత్వ పక్షం నుంచి కూడా ఎగుమతిదారుల సమస్య పరిష్కారానికి పెద్దపీట వేయాలి. సకాలంలో కొత్త విదేశీ వాణిజ్య విధాన ప్రకటన, తగిన స్థాయిలో కంటైనర్లు లభ్యమయ్యేట్లు చూడ్డం, ఆర్‌ఓడీటీఈపీకి తగిన నిధుల విడుదల, రవాణా చార్జీలు తగ్గించడం వంటి చర్యలు ఇందులో ఉన్నాయి.
 
- ఎస్‌కే షరాఫ్, ఎఫ్‌ఐఈఓ ప్రెసిడెంట్‌ 

క్యూ4లో 4.9 శాతం వృద్ధి ఉండొచ్చు...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి (క్యూ4) త్రైమాసికం ఎగుమతుల్లో 4.9 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో చమురుయేతర ఎగుమతులు విలువ 73.9 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యే వీలుంది. ఇదే జరిగితే 2019-20 ఆర్థిక సంవత్సరం క్యూ4తో పోల్చుకుంటే ఇది 12 శాతం వృద్ధి నమోదయినట్లు. మార్చి త్రైమాసికంలో ఇప్పటి వరకూ ఎగుమతులు 74.9 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, ఇందులో నాన్‌-ఆయిల్‌ వాటా 65.9 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2020-21లో మొత్తం ఎగుమతుల విలువ 279.4 బిలియన్‌ డాలర్లుగా ఉండవచ్చు. 2019-20తో పోల్చితే ఇది 10.8 శాతం తక్కువ. బ్యాంక్‌ లీడింగ్‌ ఇండెక్స్‌ (ఈఎల్‌ఐ) నమూనా ప్రకారం ఈ ఏడాది మొత్తం ఎగుమతుల్లో నాన్‌-ఆయిల్‌ ఎగుమతుల వాటా 5.6 శాతం తగ్గి 256.8 బిలియన్‌ డాలర్లకు తగ్గవచ్చు. అంతర్జాతీయంగా డిమాండ్‌ తగ్గడమే పెట్రోలియం ప్రొడక్ట్స్‌ ఎగుమతులు తగ్గడానికి కారణం. బేస్‌ ఎఫెక్ట్‌ ప్రధాన కారణంగా 2021-22లో ఎగుమతులు పురోగతి బాటనే నడిచే వీలుంది.  

- ఎగ్జిమ్‌ బ్యాంక్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top