
ఎల్రక్టానిక్స్, ఇంజినీరింగ్ ఉత్పత్తుల దన్ను
9 శాతం వృద్ధి; 38.49 బిలియన్ డాలర్లుగా నమోదు
అయిదు నెలల గరిష్టానికి వాణిజ్య లోటు
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్, ఇంజినీరింగ్ ఉత్పత్తులు తదితర విభాగాలు మెరుగ్గా రాణించడంతో ఏప్రిల్‌లో ఎగుమతులు 9.03 శాతం వృద్ధి చెంది 38.49 బిలియన్ డాలర్లకు చేరాయి. మరోవైపు, ముడి చమురు, ఎరువుల వల్ల దిగుమతులు 19.12 శాతం పెరిగి 64.91 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. దీంతో వాణిజ్య లోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) గతేడాది నవంబర్ తర్వాత .. అయిదు నెలల గరిష్టమైన 26.42 బిలియన్ డాలర్లకు చేరింది.
అప్పట్లో ఇది 31.77 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంతర్జాతీయంగా అనిశి్చతులు ఉన్నప్పటికీ ఈ ఏడాది మొత్తం మీద ఎగుమతులు సానుకూల ధోరణి కొనసాగిస్తూ, గణనీయంగా వృద్ధి చెందగలవని ఆశిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బరత్వల్ తెలిపారు. 20 దేశాలు, ఆరు కమోడిటీలపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్న వ్యూహం సత్ఫలితాలనిస్తోందని ఆయన చెప్పారు.
త్వరలోనే పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక సవాళ్లు, కరెన్సీ హెచ్చుతగ్గులు, అమెరికా ప్రతీకార టారిఫ్‌ల విధానంతో అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ నుంచి అపారెల్ ఎగుమతులు 14.43 శాతం పెరిగినట్లు పరిశ్రమ మండలి ఏఈపీసీ సెక్రటరీ జనరల్ మిథిలేశ్వర్ ఠాకూర్ తెలిపారు.
డేటా ప్రకారం..
→ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 39.51 శాతం పెరిగి 3.69 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇంజినీరింగ్ ఉత్పత్తులు 11.28 శాతం వృద్ధితో 9.51 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
→ పొగాకు, కాఫీ, మెరైన్ ఉత్పత్తులు, టీ, రెడీమేడ్ దుస్తులు, బియ్యం, రత్నాభరణాలు, సుగంధ ద్రవ్యాలు, పెట్రోలియం ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్ ఎగుమతులు పెరిగాయి.
→ క్రూడాయిల్ దిగుమతులు 25.6 శాతం పెరిగి 20.7 బిలియన్ డాలర్లకు చేరగా, పసిడి దిగుమతులు 4.86 శాతం వృద్ధితో 3.09 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
→ సేవల ఎగుమతుల విలువ 30.18 బిలియన్ డాలర్ల నుంచి 35.31 బిలియన్ డాలర్లకు చేరింది.
→ సేవల దిగుమతులు 16.76 బిలియన్ డాలర్ల నుంచి 17.54 బిలియన్ డాలర్లకు పెరిగాయి.