
ప్రతి మనిషికి సాధారణంగా జీవితం సాఫీగా సాగాలంటే ఎంత మొత్తంలో డబ్బు అవసరం అవుతుందోననే ప్రశ్న ఉంటుంది. ఒకవేళ పెళ్లి అయితే తన ఫ్యామిలీ ఆర్థికంగా భద్రంగా ఉంటుందా ఉండదా.. అనే సందేహంతో తన వద్ద ఎంత డబ్బు ఉంటే సరిపోతుందనే లెక్కలు వేసుకుంటారు. ప్రస్తుత లైఫ్‌స్టైల్, ఖర్చులు, ఇతర సౌకర్యాలకు కోటి రూపాయలు ఉంటే సరిపోతుందా.. లేదా రెండు కోట్లు కావాలా.. ఐదు కోట్లు కావాలా..? అనే ప్రశ్నలు వస్తుంటాయి. మనలో చాలా మందికి ఏదో ఒక సందర్భంలో ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది కదా. ఒక్కొక్కరి అవసరాలు వారివారి జీవన విధానాన్ని బట్టి ప్రత్యేకంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఎంతైనా సరిపోకపోవచ్చు..
సాధారణంగా చాలామంది తమ లైప్ సెటిల్ కావాలంటే ఎంత మొత్తం డబ్బుకావాలో చెప్పమంటే రాండమ్‌గా తోచిన నంబర్లు చెప్పేస్తుంటారు. ఒక్కొక్కరి అవసరాలు ఒక్కోలా ఉంటాయి. కొంతమందికి కోటి రూపాయలు ఉంటే వారి ఖర్చులు, అవసరాలు.. అన్నింటికీ సరిపోవచ్చు. ఇంకొందరికి రూ.10 కోట్లు ఉన్నా సరిపోకపోవచ్చు. ఎంత డబ్బు కావాలనేది కుటుంబ సభ్యులు, వారి అభిరుచులు, ఖర్చు నేపథ్యం, భవిష్యత్తు ప్రణాళికలను బట్టి ఆధారపడుతుంది.
ఒక్కొక్కరి అవసరాలు ఒక్కోలా..
ఆధునిక సమాజంలో ఎంత డబ్బు సంపాదించిన మరింత ఆర్జించాలనే భావన వస్తుంది. కష్టపడి పని చేసి కొంత ఆదాయం సంపాదిస్తే, మరింత ఆదాయం కావాలనిపిస్తుంది. ఈ అంతులేని కోరిక వల్ల ఆందోళన, అసంతృప్తి ఎదురవుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అలా అని సంపాదన లేకుండా ఉండాలని వారు చెప్పడం లేదు. ఇలాంటి కోరికల వల్ల నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం రాదు. కోరుకున్న జీవితాన్ని గడపడానికి వాస్తవంగా ఏమి అవసరమో తెలుసుకోవడం కీలకం. మీ నియమాలకు, ఖర్చులకు, భవిష్యత్తు ప్రణాళికలు, అత్యవసరాలకు, ఆరోగ్య సంరక్షణకు సరిపోయే డబ్బు సంపాదిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. కొంతమందికి సౌకర్యవంతమైన ఇల్లు, స్థిరమైన ఉద్యోగం, కుటుంబంతో వారాంతాల్లో ట్రిప్‌కు వెళ్లడం సౌకర్యంగా ఉంటుంది. ఇంకొందరికి ముందస్తు పదవీ విరమణ, ప్రయాణాలు చేయడం లేదా ఆర్థిక ఒత్తిడి లేకుండా సృజనాత్మక అభిరుచులను కొనసాగించాలనుకుంటారు.
ముందుగా చేయాల్సింది..
మొత్తంగా ఎంత డబ్బు సంపాదించాలనే దానిపై కాకుండా భవిష్యత్తులో ఎలాంటి జీవితం గడపాలనుకుంటున్నారు? అనే దానిపై స్పష్టత వస్తే ఎంత సంపాదించాలో తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకు మీ సౌకర్యం, ఆరోగ్యం, సంతోషం కోసం రాజీపడని అంశాలు ఏమిటని గుర్తించాలి. ఆర్థికంగా సురక్షితంగా ఉండటానికి ఏవి దోహదం చేస్తాయో తెలుసుకోవాలి. కష్టపడే వయసులో సంపాదించే మొత్తాన్ని దుబారా ఖర్చు చేయకుండా, పొదుపు చేసి భవిష్యత్తులో జీవితం సాఫీగా సాగేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అందుకు మెరుగైన పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలి.
ఇదీ చదవండి: మార్వాడీలు వ్యాపారంలో ఎందుకు విజయం సాధిస్తారు?