ఇంటి డాక్యుమెంట్లు బ్యాంక్‌ పోగొడితే? | House documents missed by bank after Home loan what to do | Sakshi
Sakshi News home page

ఇంటి డాక్యుమెంట్లు బ్యాంక్‌ పోగొడితే?

Aug 2 2025 4:47 PM | Updated on Aug 2 2025 7:41 PM

House documents missed by bank after Home loan what to do

సాక్షి, సిటీబ్యూరో: బ్యాంక్‌ రుణంతో ఇల్లు కొనడం తెలిసిందే.. ఇంటి దస్తావేజులు తనఖాగా పెట్టి రుణం తీసుకోవడం కామనే! ప్రతినెలా క్రమం తప్పకుండా ఈఎంఐ కట్టేసి.. చివరకు బ్యాంక్‌ నుంచి నో డ్యూ సర్టిఫికెట్‌ కూడా తీసుకున్నాక.. తనఖా పెట్టిన ఇంటి దస్తావేజులు ఎక్కడో పోయాయని బ్యాంక్‌ చెబితే? బ్యాంక్‌ అధికారులతో గొడవ పెట్టుకుంటాం. లేకపోతే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి సర్టిఫైడ్‌ సేల్‌ డీడ్‌ కాపీ కోసం దరఖాస్తు చేస్తాం.. అంతేకదా!?

మహారాష్ట్రకు చెందిన ప్రదీప్‌ శెట్టి అలా చేయలేదు. 2004లో ప్రదీప్‌ మహారాష్ట్ర పరెల్‌లోని స్టాండర్డ్‌ చార్టెర్డ్‌ బ్యాంక్‌లో రూ.9 లక్షల గృహ రుణం తీసుకున్నాడు. అన్ని ఈఎంఐలు కట్టేశాక, బ్యాంక్‌ నుంచి నో– డ్యూస్‌ సర్టిఫికెట్‌ కూడా పొందాడు. ఆ తర్వాత బ్యాంక్‌ అందించాల్సిన సేల్‌డీడ్‌ కాపీలను ఇవ్వకుండా అవెక్కడో మిసయ్యాయని వివరించింది. దీంతో ప్రదీప్‌ ‘తనఖా పెట్టిన దస్తావేజులను బ్యాంక్‌ ఎక్కడో పోగొట్టింది. ప్రాపర్టీ ధరలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో సేల్‌డీడ్‌ కాపీలు లేకపోవడంతో ఇంటిని విక్రయించలేకపోతున్నానని, పైగా ఈ ఘటనతో మానసిక వేదనకు గురయ్యాయని, విలువైన సమయం వృథా చేసినందుకు బ్యాంక్‌ పరిహారాన్ని చెల్లించాల్సిందేనని’ డిస్ట్రిక్ట్‌ కన్జ్యూమర్‌ డిస్ప్యూట్స్‌ రిడ్రెసల్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు.

పరిహారం సరిపోలేదు.. 
ప్రదీప్‌కు రూ.60 వేలు నష్ట పరిహారాన్ని బ్యాంకు చెల్లించాలని డిస్ట్రిక్ట్‌ కన్జ్యూమర్‌ కమిషన్‌ తీర్పునిచ్చింది. ఇందులో రూ.50 వేలు దస్తావేజులు పోగోట్టినందుకు, రూ.5 వేలు మానసిక వేదనకు గురి చేసినందుకు, మరో రూ.5 వేలు ఫిర్యాదు దాఖలు ఖర్చులకు అని వివరించింది. అయితే ఈ పరిహారంతో సంతృప్తి చెందని ప్రదీప్‌ షెట్టి.. మహారాష్ట్ర స్టేట్‌ కన్జ్యూమర్‌ డిస్ప్యూట్స్‌ రిడ్రెసల్‌ కమిషన్‌ను ఆశ్రయించాడు. దీంతో స్టేట్‌ ఫోరం.. పరిహార మొత్తాన్ని రూ.60 వేల నుంచి రూ.1.15 లక్షలకు పెంచింది. 3 నెలల్లోపు కస్టమర్‌కు సర్టిఫైడ్‌ సేల్‌డీడ్‌ కాపీని అందించాలని, లేనిపక్షంలో ప్రతి నెలా రూ.50 వేల జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చింది.

ఎవరైనా సరే ఇలా చేయండి 
కన్జ్యూమర్‌ డిస్ప్యూట్స్‌ రిడ్రెసల్‌ కమిషన్‌ ఇచ్చిన తీర్పు కేవలం ప్రదీప్‌ శెట్టికే కాదు.. మనలో ఎవరి ప్రాపర్టీ దస్తావేజులైనా సరే బ్యాంక్‌లు పోగోడితే.. కస్టమర్‌ పరిహారంతో పాటూ తిరిగి సర్టిఫైడ్‌ సేల్‌డీడ్‌ కాపీని కూడా అందించాల్సిన బాధ్యత బ్యాంక్‌లదే! ఇందుకోసం స్థానిక కన్జ్యూమర్‌ డిస్ప్యూట్స్‌ రిడ్రెసల్‌ కమిషన్‌ను సంప్రదిస్తే చాలు! ఒకవేళ ఇంట్లో దాచిపెట్టుకున్న ప్రాపర్టీ దస్తావేజులు దొంగలు పడో లేక ఇతర కారణాలతో మిస్‌ అయితే? దస్తావేజులు పోయాయని కంగారు పడకండి. మళ్లీ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు నుంచి సర్టిఫైడ్‌ దస్తావేజులను పొందొచ్చు. కాకపోతే కొంత శ్రమించాల్సి ఉంటుంది.  

సర్టిఫైడ్‌ కాపీని ఇవ్వాలని కోరుతూ.. 
ముందుగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సేల్‌ డీడ్‌ పోయిందని ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత దస్తావేజులు పోయినట్టుగా స్థానిక వార్తా పత్రికల్లో ప్రకటన ఇవ్వాలి. ఎవరికైనా దొరికితే సమాచారం అందించాలని కోరుతూ నోటీసు ఇవ్వాలి. గతంలో ఏదైతే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రాపర్టీని రిజిస్ట్రేషన్‌ చేయించారో మళ్లీ అదే కార్యాలయానికి వెళ్లి ఒరిజినల్‌ సేల్‌డీడ్‌ దస్తావేజులు పోయినట్లు సంబంధిత అధికారికి వివరించి సర్టిఫైడ్‌ కాపీని ఇవ్వాలని కోరుతూ స్వీయ దస్తూరితో లెటర్‌ రాసివ్వాలి.

ఫామ్‌–22లో పేరు, చిరునామా వంటి వివరాలన్నీ నమోదు చేసి.. ప్రాపర్టీ జిరాక్స్‌ కాపీలను జత చేయాల్సి ఉంటుంది. అలాగే సంబంధిత ప్రాపర్టీ పేరు మీద ఉన్న ఆధార్, పాన్, రేషన్‌ కార్డ్, కరెంట్‌ బిల్లు వంటివి జత చేయాలి. వీటన్నింటికీ పోలీసు ఫిర్యాదు కాపీ, పత్రిక ప్రకటన జత చేసి సబ్‌ రిజిస్ట్రార్‌కు అందించాలి. నిర్ణయించబడిన ఫీజును చెల్లిస్తే సరిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement